తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శనరెడ్డి పోటీ చేస్తున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండి కూటమి మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో తలదూర్చకపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల మద్దతుతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పిలుపునిచ్చారు. తెలుగు వారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సుదర్శనరెడ్డిని గెలిపించుకునేందుకు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల వల్ల ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్న బీఆర్ఎస్.. రెండు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేయొద్దని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీతో చేతులు కలపడం వల్లే బీఆర్ఎస్ ఎన్నికలను బహిష్కరిస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు అధికారికంగా ఏ ప్రకటన చేయకపోయినా, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని నిర్ధారిస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేమని చెబుతున్న బీఆర్ఎస్ కొంతకాలంగా తటస్థ వైఖరి ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాగా, బీజేపీ కూడా తమను తొక్కేయాలని చూస్తుండటంతో ఆ పార్టీని దూరం పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు బరిలోకి దింపిన అభ్యర్థులకు మద్దతు ఇస్తే వ్యూహాత్మక తప్పిదం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్లతో రెండు రోజులుగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు తెలిపినా, రాష్ట్రంలో ఆ కూటమితో సంబంధాలు అంటగట్టే పరిస్థితి ఉన్నందున దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి ఐదుగురు ఎంపీల బలం ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, ఇండి కూటమి తరఫున బరిలో దిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి క్రాస్ ఓటింగుపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్ ప్రస్తుతం కేంద్రంలో తటస్థ రాజకీయ వైఖరిని అనుసరిస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల ఓట్లపై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. అయితే వైసీపీ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి బహిరంగ మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తనకు ఉన్న పరిచయాలతో కొందరు వైసీపీ నేతలతో మాట్లాడి రాజకీయంగా దుమారం రేపారు.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మద్దతుపైనా ఇండి కూటమి ఆశలు పెట్టుకుంది. తెలంగాణ సెంటిమెంటుతో ఆ పార్టీకి ఉన్న ఐదు ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పడతాయని ఆశించింది. అయితే బీఆర్ఎస్ మాత్రం తెలివిగా వ్యవహరిస్తూ ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు. వాస్తవానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆశించినట్లు ఎన్డీఏ నుంచి క్రాస్ ఓటింగు జరిగినా, బీఆర్ఎస్ వంటి పార్టీలు మద్దతు ఇచ్చినా అధికార కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఎదురయ్యేది. కానీ, తటస్థంగా ఉన్న 11 పార్టీల్లో వైసీపీ అధికార కూటమికి మద్దతు ఇవ్వడం, బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల నామమాత్రపు పోటీ మాత్రమే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.