దేశంలో రెండో అతి పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవి అయిన ఉప రాష్ట్రపతి కోసం ఈ నెల 9న ఎన్నిక జరగనుంది. లోక్ సభ రాజ్యసభ ఎంపీలతో పాటు నామినేటెడ్ ఎంపీలు అంతా కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకోన్నారు. ఎన్డీయే ఇండియా కూటమి పోటీ పోటీ గా తమ అభ్యర్థులను నిలబెట్టి గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో విందు రాజకీయాలు షురూ అయ్యాయి.
ఇక ఇండియా కూటమి అభ్యర్ధిగా పోటీలో ఉన్న తెలుగు వారు తెలంగాణాకు చెందిన జస్టిస్ సుదర్శనరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8న విందు ఇవ్వబోతోంది. జాతీయ అధ్యక్షుడు అయిన మల్లికార్జున్ ఖర్గే ఈ విందును ఇస్తున్నారు. పార్లమెంట్ అనెక్స్ లో ఇచ్చే ఈ విందుకు ఇండియా కూటమికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అంతా హాజరవుతున్నారు. ఒక్క ఓటు కూడా తమ వైపు నుంచి పొల్లుపోకుండా సుదర్శన్ రెడ్డికి వేసేందుకు తగిన వ్యూహంతో ముందుకు పోతున్న ఇండియా కూటమి ఈ విందును ఏర్పాటు చేసింది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అధికార ఎన్డీయే కూటమి తరఫున పోటీలో ఉన్న వారు సీపీ రాధాకృష్ణన్. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఎన్డీయే తమ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసమే కాదు భారీ మెజారిటీని సాధించడం కోసం వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికార నివాసంలో ఎన్డీయే ఎంపీలు అందరికీ విందుకు ఇస్తున్నారు. ఈ విందుకు ఎన్డీయే దాని మిత్ర పక్షాలకు చెందిన ఎంపీలు అంతా హాజరు కాబోతున్నారు. అంతే కాదు ఎన్డీయే కూటమి అభ్యర్ధికి మద్దతు ఇచ్చిన పార్టీల ఎంపీలు సైతం హాజరవుతాయని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఎన్డీఎ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో భారీ కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీయే ఎంపీలకు మాక్ పోలింగ్ ని నిర్వహిస్తోంది. అలాగే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద రెండు రోజుల వర్క్ షాప్ ని కూడా నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఇండియా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు లేఖ రాశారు. అందులో ఉప రాష్ట్రపతిగా తాను నెగ్గితే ఏమి చేస్తానో వివరించడమే కాకుండా తన గురించి ఆయన సోదాహరణంగా తెలియచేసే ప్రయత్నం చేశారు. అదే విధంగా రాజకీయాలకు అతీతంగా ఎంపీలు ఈ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ఇక మజ్లిస్ పార్టీ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. ఆయనను న్యాయ కోవిదుడుగా అసద్దుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. అంతే కాదు హైదరాబాద్ కి చెందిన వ్యక్తిగానూ గౌరవిస్తూ తమ పార్టీ ఆయనకు ఓటు వేయనుందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణలో ఆయన లాంటి వారు అవసరం ఉందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద చూస్తే కనుక ఇండియా కూటమి అభ్యర్ధికి రాజకీయాలకు అతీతంగా ఎన్ని ఓట్లు పడతాయో అన్న ఆసక్తి అయితే నెలకొంది.