జగ్దీప్ దన్ ఖడ్ రాజీనామాతో ఇటీవల అనూహ్యంగా ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి.. ఇండియా కూటమి అంతే అనూహ్యంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ రాధాక్రిష్ణన్ బరిలో నిలపగా.. విపక్ష ఇండియా కూటమి కూడా పోటీకి సై అంటూ అభ్యర్థిని ప్రకటించింది. అయితే, ఇందులో విశేషం ఏమంటే ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ వ్యక్తి. మాజీ న్యాయమూర్తి. న్యాయ రంగంలో విశేష అనుభవం ఉన్న ఆయన లోకాయుక్తగానూ సేవలందించారు.
తెలంగాణకు చెందిన ప్రఖ్యాత న్యాయ నిపుణుడైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఈయనను అభ్యర్థిగా ప్రకటించడంతో ఉప రాష్ట్రపతి పదవికి పోటీ తప్పనిసరి అయినట్లైంది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారంలో జన్మించిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1946లో పుట్టిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి 1971లో ఉస్మానియూ వర్శిటీ నుంచి న్యాయ విద్య చదివారు. అదే ఏడాది బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు. -1995లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007-11 మధ్య సుప్రీం కోర్టు జడ్డిగా బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్ అనంతరం 2013లో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టారు.