సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వెంకీ తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. అందులో భాగంగానే వెంకీ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వెంకీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని కన్ఫర్మ్ అయినప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా వెలువడలేదు. గతంలో త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు వర్క్ చేయగా ఆ రెండు సినిమాలూ సూపర్‌హిట్లుగా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. ఇన్నేళ్లకు వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తుండటంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవగా ఆగస్ట్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ క్రేజీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తోంది. వారిలో ఒకరు సీనియర్ హీరోయిన్ త్రిష కాగా మరో హీరోయిన్ టాలీవుడ్ జూనియర్ హీరోయిన్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసిన వెంకీ ఈసారి ఓ సీనియర్ హీరోయిన్, మరో జూనియర్ హీరోయిన్ తో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. కాగా వెంకీ, త్రిష కలిసి గతంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బాడీ గార్డ్, నమో వెంకటేశ సినిమాలు చేయగా ఇది నాలుగో సినిమా కానుంది.