ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న వెంకటేష్ తన తర్వాతి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో వచ్చిన సక్సెస్ ను కాపాడుకోవాలని ఏ కథ పడితే అది కాకుండా మంచి స్క్రిప్ట్ తో సినిమా చేయాలని చూస్తున్నారు విక్టరీ వెంకటేష్. వెంకీ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమాను చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో రానున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనైతే రాలేదు కానీ ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాకు కథను లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారని అంటున్నారు.
ఈ సినిమాకు వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పని చేయగా ఆ రెండు సినిమాలూ మంచి హిట్లుగా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాక మాత్రం వీరిద్దరూ కలిసి పని చేసింది లేదు. ఇన్నేళ్లకు వీరిద్దరి కాంబోలో సినిమా రానుండటంతో ఈ కాంబినేషన్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ న్యూస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వెంకీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా, అందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం. త్వరలో సినిమాను మొదలుపెట్టి 2026 సమ్మర్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంటుందని భావిస్తున్నారు. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.