కాదేదీ ఉచితం ఈ లోకంలో. ఏదీ ఫ్రీగా రాదు, ఒకరికి ఒక చోట ఉచితంగా ఇచ్చారు అంటే మరో చోట ఇంకొందరి కష్టం నుంచి మాత్రమే దాన్ని తెచ్చి ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఉచిత పధకాలు అమలు అవుతున్నాయి అంటే పన్నులు చెల్లించే వారి రెక్కల కష్టం నుంచి మాత్రమే అని గుర్తించాలి. సమ సమాజం కోసమే ఇదంతా అన్న వాదన కూడా తార్కికంగా చెల్లదని అంటున్నారు. ఎందుకంటే ఉచితాలు అందుకున్న వారు ఎప్పటికీ ఆర్థికంగా బలోపేతం అయినది చరిత్రలో ఎక్కడా లేదు అని కూడా ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఉచితాలు వద్దు మహాప్రభో అని అంతా మొర పెట్టుకుంటున్నారు.
ఓటర్లే ఎపుడూ తెలివైన వారు ఎందుకంటే వారి బుర్రలో అన్ని పార్టీలూ ఉంటాయి. సుదీర్ఘమైన కాలం పాటు ఉమ్మడి ఏపీలో పాలించిన కాంగ్రెస్ ని దించి తొమ్మిది నెలల టీడీపీకి పట్టం కట్టారు అంటే జనాల తెలివిని వెల కట్టడం ఎవరికి సాధ్యం అని అంటారు. ఇందిరమ్మని అమ్మగా చూసిన వారే తరువాత కాలంలో ఓడించేశారు. అంతే కాదు స్వయంగా ఆమె పోటీ చేసిన చోట కూడా ఎంపీగా కూడా గెలిపించలేదు అంటే ఓటర్ల వ్యూహాల ముందు ఎవరైనా బలదూర్ అన్నది అర్ధం అవుతోంది కదా. ఇక ఉచితాల విషయంలో ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా తమ జేబులో నుంచి తీసి ఇస్తున్నారా అన్నదే.
తన చేతికి ఎముక లేదని తానే సంక్షేమ సృష్టి కర్తను అన్నట్లుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సొమ్ముని ప్రజల ఖాతాలో నగదు బదిలీ పధకం ద్వారా అయిదేళ్ళూ ఇచ్చిన జగన్ ని 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారు అంటే పధకాలకు ఇచ్చిన సొమ్ము ఆయన జేబులో నుంచి ఇచ్చినది కాదని అర్ధం చేసుకోబట్టే అని అంటున్నారు. అంతే కాదు చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తాను అని అనబట్టే అని కూడా చెబుతున్నారు. మరి రేపటి రోజున జగన్ ఇంతకంటే ఎక్కువ పధకాలు డబ్బులు పెంచి మరీ ఇస్తాను అంటే చంద్రబాబు ఇస్తున్న పధకాల సంగతేంటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది కదా అని సైతం అంటున్నరు.
ఏపీలో ఉచిత బస్సు వల్ల ఒరిగిందేమీ లేదని అంటున్నారు. ఉచితంగా బస్సు ఎక్కి కిక్కిరిసిపోయిన తరువాత మహిళలు విమర్శించేది ప్రభుత్వాన్నే అని అంటున్నారు ఎక్కువ బస్సులు వేయలేదని కూడా నిందిస్తున్నారు. పురుషులు అయితే ఈ బస్సుల వల్ల తమ కొంప ముంచారు అని అంటున్నారు. ఆటో డ్రైవర్లు అయితే సరే సరిగా ఉంది. తమ ఉపాధి పోయింది అని వారు మండి పోతున్నారు. మరో వైపు చూస్తే ఉచిత బస్సుల వల్ల తాము సమయానికి విధులకు వెళ్ళలేకపోతున్నామని మహిళా ఉద్యోగులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్కీం ఏ మేరకు ఓట్లు తెస్తుందని ప్రశ్నలు ఉన్నాయి.
ఉచిత బస్సులతో సహా ఫ్రీబీస్ మీద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా నెల్లూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలే చెప్పారు. అసలు ఉచితాలు ఎందుకు అని ప్రశ్నించారు దానికి బదులు అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు. ఉచితాల వల్ల జనాలలో సంతృప్తి పెరగకపోగా మరిన్ని కోరుకుంటారని వాటిని తీర్చడం ఎవరి తరమని లాజిక్ తో కూడిన ఆయన ప్రశ్నకు జవాబు అయితే లేదు మరి. అప్పులు చేసి మరీ ఉచితాలు అందించడం అవసరమా అన్న సూటి ప్రశ్నకు సమాధానం కోసం వెతుక్కోవాల్సిందే. అంతే కాదు ఎన్ని అప్పులు తెస్తున్నారు, ఎందుకోసం తెస్తున్నారు, అయిదేళ్ళలో చేసిన అప్పులేమిటి వాటిలో దిగిపోయేనాటికి ఎన్ని తీరుస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు పెద్దాయన చాలానే వేశారు. మరి ఉచితాల వెంట బడుతూ ఓట్ల పంట పండించుకుందామని చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవని కూడా అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఉచితాలు అమలు అవుతున్నాయి. అధికార పక్షమైనా విపషమైనా కూడా ఈ విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలని అంతా కోరుకుంటున్నారు.