దారుణ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న డిగ్రీ విద్యార్థిని వర్షిత హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అనూహ్య మలుపులు తిరుగుతున్న ఈ హత్యకేసుకు సంబంధించిన కీలక అంశాల్ని చిత్రదుర్గం జిల్లా ఎస్పీ తాజాగా వెల్లడించారు. దారుణ హత్యకు గురైన వర్షిత.. చనిపోయే సమయానికి ఎనిమిది నెలల గర్భవతిగా గుర్తించారు.
ఇరవై ఒక్క ఏళ్ల నెట్ వర్కింగ్ ఉద్యోగి చేతన్ కుమార్ చేతిలో ఆమె హత్యకు గురైంది. ఇన్ స్టా ద్వారా మొదలైన పరిచయం.. తర్వాత స్నేహంగా మారటం.. ప్రేమగా రూపాంతరం చెంది.. చివరకు హద్దులు దాటిన అనుబంధం ఆమెను తిరిగి రాని లోకాలకు వెళ్లేలా చేసిందని చెబుతున్నారు చిత్రదుర్గానికి చెందిన 21 ఏళ్ల చేతన్ కొప్పళ జిల్లా గంగావతిలో ఒక నెట్ వర్కింగ్ సంస్థలో పని చేస్తుంటాడు.
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసే వారిని సంస్థకు పరిచయం చేయటం అతడి జాబ్ రోల్. ఎవరైనా ఉద్యోగం.. ఉపాధి కావాలంటే తనను సంప్రదించాలని కోరుతూ ఏడాది క్రితం ఇన్ స్టాలో పోస్టు చేశాడు. దాన్ని చూసిన వర్షిత అతడికి ఫోన్ చేసింది. ఉద్యోగ వేటలో భాగంగా పరిచయమైన చేతన్ తో మొదలైన ఆమె స్నేహం.. కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఇరువురు హద్దులు దాటేశారు. గర్భవతి అయ్యానన్న విషయాన్ని గుర్తించి.. ఏం చేయాలో పాలుపోక.. వేరే ఊళ్లో ఉండే పిన్నికి విషయాన్ని చెప్పి సాయాన్ని కోరింది.
దీంతో స్పందించిన పిన్ని.. చేతన్ కు ఫోన్ చేసి ఆమెను వెంటనే పెళ్లాడాలని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. అయితే.. చేతన్ ఒక తీవ్ర వ్యాధి బారిన పడిన విషయాన్ని తెలుసుకున్న వర్షిత.. కలవరపాటుకు గురై అతడికి దూరంగా ఉండసాగింది. అతడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవటం.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానానికి గురైన చేతన్.. ఆమెను అంతమొందించాలని భావించాడు ఇందులో భాగంగా ఆమెకు మాయమాటలు చెప్పిన చేతన్.. తన వద్దకు వర్షిత వచ్చేలా చేసుకొని.. బైపాస్ మార్గంలోని ఒక హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసి.. ఆమె డెడ్ బాడీ దొరక్కుండా ఉండేందుకు పెట్రోల్ తో కాల్చి వేసేందుకు చేసిన ఏర్పాట్లను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు పోలీసులు. వర్షిత హత్య కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారింది.