వన్యప్రాణులను అక్రమంగా పొందారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిన తరువాత బిలియనీర్ అంబానీ కుటుంబానికి చెందిన అతిపెద్ద ప్రైవేటు జంతుప్రదర్శనశాలను దర్యాప్తు అధికారులు సందర్శించనున్నారు.ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణలతోపాటు ‘వంతారా’లో వన్యప్రాణి చట్ట ఉల్లంఘనలు జరిగాయా అనే విషయంపై కూడా దర్యాప్తు జరుపుతారు. అయితే ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, కానీ అధికారులు తమ విధినిర్వహణలో విఫలమయ్యారనే ఆరోపణల మేరకు దర్యాప్తుకు ఆదేశించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
వందలాది ఏనుగులు, పులులు, ఇతర వన్య ప్రాణులున్న ‘వంతారా’ను నడుపుతున్నది ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ. దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ‘వంతారా’ హామీ ఇచ్చింది.ఆరోపణలపై నేరుగా వ్యాఖ్యానించకుండా ”పారదర్శకతకు, దయాభావానికి, అలాగే చట్టాన్ని పూర్తిగా పాటించడానికి వంతారా కట్టుబడి ఉంది. జంతువుల రక్షణ, పునరావాసం, సంరక్షణ లక్ష్యాలుగా కొనసాగుతుంది” అని పేర్కొంది.
3,500 ఎకరాలలో విస్తరించి, 2వేల ప్రాణులకు ఆవాసంగా ఉన్న వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రంగా పేరొందింది. అంతేకాదు గత ఏడాది జరిగిన అనంత్ అంబానీ అత్యంత విలాసవంతమైన ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ల వేదికల్లో ఒకటిగా నిలిచి, ప్రపంచస్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కింది.పశ్చిమతీర రాష్ట్రమైన గుజరాత్‌లో జామ్‌నగర్ వద్ద ఈ జంతుప్రదర్శనశాల ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారానికి కూతవేటు దూరంలోనే దీన్ని ఏర్పాటుచేశారు.
ఈ ఏడాది మార్చిలో ‘వంతారా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.తన సందర్శన తాలూకా ముచ్చట్లను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వంతారా ప్రయత్నం ‘నిజంగా ప్రశంసనీయం’ అని అభివర్ణించారు.ప్రజల సందర్శనకు అనుమతించకపోవడంతో పాటు వన్యప్రాణి కార్యకర్తలు, పరిరక్షకులు ‘వంతారా’పై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని ఆగస్టు 26వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు… అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది.కానీ..‘‘ అధికారులు లేదా, కోర్టులు తమ విధి నిర్వహణలో అనాసక్తి చూపుతున్నారని, లేదంటే అశక్తతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ,నిజాలు వెలికితీయడం కోసం స్వతంత్ర దర్యాప్తును ఆదేశించటం సమంజసం అని భావిస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.
అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్‌లో భాగమైన ‘న్యూస్ 18’ వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం… ‘వంతారా’లో 2,000 రకాల వన్యప్రాణులు ఉన్నాయి. దాదాపు 200 ఏనుగులతో పాటు పెద్దపులులు, సింహాలు, చిరుతపులులు 300 వరకూ ఉన్నాయి. అలాగే 300కు పైగా శాకాహార జంతువులు, మరో 1,200 సరీసృపాలు అక్కడున్నాయి.కిందటేడాది మార్చిలో భారతీయ సినీతారలు వంతారను సందర్శించడం పతాకశీర్షికలుగా మారింది. అనంత్ అంబానీ, రాధికామర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలలో భాగంగా వీరు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, ప్రపంచ వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
ఇటీవల మహారాష్ట్రలో తీవ్ర నిరసనలకు ‘వంతారా’ మూలకారణమైంది. కొల్హాపూర్‌లోని జైన దేవాలయంలో మూడు దశాబ్దాలుగా ఉంటున్న మహాదేవి అనే ఏనుగు అనారోగ్యానికి గురైతే, హైకోర్టు ఆదేశాల తర్వాత ఆ ఏనుగును అధికారులు జులై నెలలో వంతారాకు తరలించారు. దీంతో ‘వంతారా’పై రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో, మహాదేవిని వెనక్కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.మరోవైపు ‘వంతారా’ ఏర్పాటుచేసిన ప్రదేశం భారీ రిఫైనరీకి పక్కనే ఉందని, దాని నుంచి వెలువడే వేడి, పొడి వాతావరణం కొన్ని జాతుల వన్యప్రాణులకు అనుకూలం కాదని వన్యప్రాణి కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నలుగురు విశ్రాంత న్యాయమూర్తులతో కూడిన సిట్‌ను వంతారాపై సెప్టెంబర్ 12లోగా తన నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది.తదుపరి విచారణ సెప్టెంబర్ 15న జరగనుంది.ఇక అక్రమంగా జంతువులను, ప్రత్యేకించి ఏనుగులను తీసుకురావడం, వన్యప్రాణి చట్టాల ఉల్లంఘనలు, ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేయనుంది.వాతావరణ పరిస్థితులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, ఇండస్ట్రియల్ జోన్ సమీపంలో ఈ కేంద్రం ఉందన్న ఆరోపణలపై కూడా సిట్ విచారణ జరపనుంది.మంగళవారం సిట్ తన మొదటి సమావేశాన్ని నిర్వహించిందని, ఇది తన సభ్యులకు పాత్రలు, బాధ్యతలను అప్పగించడంపై దృష్టి సారించిందని స్థానిక మీడియా తెలిపింది.
PREDICTABLE INVESTIGATION | A new SIT is set up to probe Vantara, Anant Ambani’s pet project in Jamnagar, built by forcefully taking away animals from BJP-ruled states.
Let's not forget, it was inaugurated by none other than PM @narendramodi last year. Will the SIT dare to… pic.twitter.com/j3zJgpUlz5
— Congress Kerala (@INCKerala) August 26, 2025