వంగవీటి మోహనరంగా. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.వాస్తవానికి కాపు నాయకులు.. రంగాను తమ వాడిగా పేర్కొంటాయి. తమ కోసమే ఆయన రాజకీయాల్లో అనేకం చేశారని కూడా చెబుతాయి. అయితే.. ఆయా సామాజిక వర్గాలు అనుకున్నట్టుగా రంగా ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదు. తనను తాను అందరి వాడిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తాజాగా ఆయన కుమార్తె ఆశ చెప్పినట్టు.. కులం, మతం, ప్రాంతానికి రంగా ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు.
అంతేకాదు.. ఒక ప్రాంతానికి కూడా పరిమితం కాకుండా.. రంగా అనేక సేవలు చేశారు. ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లోనూ పేదల కోసం.. వారి హక్కులు, ఇళ్ల కోసం ఉద్యమించారు. ఈ క్రమంలోనే ఆయన విజయవాడలో కొండ ప్రాంతాల వాసులకు పట్టాలు ఇవ్వాలనే ఉద్యమం చేపట్టి.. దానిలోనే కరిగిపోయారు. ఇది.. ఇతమిత్థంగా రంగా గురించి చెప్పే ప్రధాన విషయం. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన ఆశయాలు నిలబెడతామని.. ఆయన కోసం పనిచేస్తామని చెబుతూ… కుమార్తె ఆశ ప్రజల క్షేత్రంలోకి వస్తున్నట్టు ప్రకటించారు.
అయితే.. ఇప్పటి వరకు రంగా ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో ఈ కుటుంబం ఏమేరకు సక్సెస్ అయిందన్నది ప్రధాన ప్రశ్న. 1988, డిసెంబరు 26న రంగా మరణించే వరకు.. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేశారు. ఈ తరహా స్ఫూర్తిని కొనసాగించడంలో కుటుంబం విఫలమైందన్నది వాస్తవం. పదవులు, రాజకీయాల కోసం.. వెంపర్లాడడంతోనే ఆయన సతీమణి, కుమారుడు కూడా కాలం వెళ్లదీశారన్నది నిష్ఠూరంగా అనిపించినా… పచ్చి నిజం. ఒకానొక దశలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వనంటే రంగా కుంగిపోలేదు. కుమిలిపోలేదు.
అలాగని మరో పార్టీలోకి కూడా రంగా వెళ్లలేదు. ప్రజల మధ్యకు వచ్చారు. వారితోనే తన జీవితమని ప్రకటించారు. అప్పటికి మహా అయితే.. 35-37 ఏళ్ల వయసు ఉంటుంది. ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ఆయనను తిరిగి ఆహ్వానించింది. ఇదీ.. రంగా స్ఫూర్తి.. పేదలకు మేలు చేయడమే ఆయన ఆశయం. ఈ తరహా స్ఫూర్తిని ఆశా కిరణ్ అందుకుంటారా? లేక ఏదో ఒక పార్టీకి అంకితం అవుతారా..? అన్న దానిపైనే రంగా ఆశయ సిద్ధి ఆధారపడి ఉంటుంది. ఇంతకు మించి.. రంగా ఆశించింది కూడా ఏమీ లేదు. మరి ఆమె అడుగులు ఎలా పడతాయో చూడాలి.


















