పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. ఒకదశలో ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోవటంతో అప్పటికప్పుడు జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. దాదాపు 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం జైలుకు తరలించారు. జైలు నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో వల్లభనేని వంశీని చూసిన వారంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. కారణం.. చూసినంతనే గుర్తు పట్టలేని విధంగా వల్లభనేని వంశీ కనిపించటమే.
కాళ్ల వాపులు.. శ్వాస సమస్యను ఎదుర్కొంటున్న వంశీకి.. శనివారం మధ్యాహ్నం వేళలో శ్వాస తీసువటానికి సైతం ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించారు. దీంతో ఆయనకు జైల్లోనే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. పరిస్థితి తీవ్రంగా ఉందన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులకు జైలు అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆయనకు అత్యవసర వైద్యం కోసం జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వంశీని ఆసుపత్రికి తరలించే సమచారం వైద్యులకు లేకపోవటంతో అప్పటికి డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో.. ఇంటికి వెళ్లిన వైద్యులకు సమాచారం అందించి.. అత్యవసరంగా రప్పించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆయనకు గుండె.. శ్వాసకోశ.. జనరల్ ఫిజీషియన్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో పలు పరీక్షలు నిర్వహించారు. దాదాపు మూడు గంటలకు పైనే ఆసుపత్రిలో ఉంచి పరీక్షలు చేయించారు.
బీపీలో హెచ్చుతగ్గులు.. ఆస్తమా కారణంగా ఆయాసం లాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాళ్లకు వాపులు రావటంపైనా వైద్యులు పరీక్షలు జరిపారు. బీపీ మాత్రల్ని ఈ మధ్యన మార్చినట్లుగా గుర్తించిన వైద్యులు.. కొన్ని మెడిసిన్స్ తో పాటు.. కొన్ని సూచనలు చేశారు. రిపోర్టులను పరిశీలించిన వైద్యులు.. తీవ్రమైన అనారోగ్యం లేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి జైలుకు తరలించారు.