వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు జైలు కష్టాలు తీరడం లేదు. ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో ఐదింటికి బెయిల్ మంజూరు కాగా, ఒక్కటి పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న వంశీకి ఆ కేసులోనూ నేడో రేపో బెయిలు వస్తుందని ప్రచారం జరుగుతుండగా, నూజివీడు పోలీసులు అనూహ్యంగా మరో కేసు తెరపైకి తెచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన నూజివీడు పోలీసులు శుక్రవారం పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో కేసులో రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ఆయనపై నమోదైన కేసుల సంఖ్య ఏడుకు చేరింది. మొత్తం 5 కేసుల్లో బెయిల్ సంపాదించుకున్న వల్లభనేని మరో రెండు కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటే కానీ, విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ 16వ తేదీ శుక్రవారం విచారణ జరగనుంది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో కానీ, ఈలోగా నూజివీడు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన నియోజకవర్గంలోని బాపులపాడులో ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మోసం చేశారనే విషయమై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఆయన మరో 14 రోజులు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ కేసులోనూ ఆయనకు బెయిల్ వస్తేనే బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. వంశీపై వరుస కేసులతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి పెంచుతోందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టానుసారం మాట్లాడిన పాపానికి ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
వంశీపై వరుసగా కేసులు నమోదు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు, జైలు నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారు. వంశీ దుస్థితిపై వైసీపీ కార్యకర్తల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు వంద రోజులుగా జైలులో ఉన్న వంశీ బాగా నీరసించిపోయారు. బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్న ఆయనను పోలీసులు ఆస్పత్రికి జైలుకు మధ్య తిప్పుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఇంకెన్నాళ్లు జైలులో ఉండాల్సివస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.