వైకుంఠ ఏకాదశి విశిష్టత జ్ఞాన ద్వారం ద్వారా మోక్ష ప్రాప్తి
ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏడాది (2025) డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఈ పర్వదినం జరుపుకుంటున్నాం. ఈ రోజు భక్తులు ఉపవాస దీక్షతో శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు. తిరుమల, శ్రీరంగం వంటి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
వైకుంఠ ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?
సౌరమాన పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజు మూడు కోట్ల దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు వస్తారని పురాణ విశ్వాసం. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.
ఈ పర్వదినం శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుంచి మేలుకొనే రోజుగా కూడా గుర్తిస్తారు. యోగనిద్ర అంటే జీవుల కర్మలకు తగిన ఫలితాలు, శరీరాలు ఇవ్వడానికి చేసే ఆలోచన. ఈ రోజు భగవంతుడిని ఆరాధించడం ద్వారా భక్తులు పాపాల నుంచి విముక్తి పొంది, వైకుంఠ ప్రాప్తి సాధిస్తారని నమ్మకం.
ఉత్తర ద్వార దర్శనం – జ్ఞాన మార్గం
ఈ పర్వదినం యొక్క ప్రధాన విశిష్టత ఉత్తర ద్వార దర్శనం. ఆలయాల్లో ఉత్తర దిక్కున ఉన్న ద్వారం ఈ రోజు మాత్రమే తెరుచుకుంటుంది. దీని అంతరార్థం లోతైనది:
– ఉత్తరం అంటే జ్ఞానం; దక్షిణం అంటే కర్మ. పరమాత్మను జ్ఞానంతోనే దర్శించగలం. అజ్ఞానం, మోహం, కర్మలతో కాదు.
– ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు , ధనాధిపతి. ఇక్కడ ధనం అంటే లౌకిక ధనం కాదు, జ్ఞాన ధనం. అది శాశ్వతం.
– ఉత్తర ద్వారం అంటే మోక్ష ద్వారం. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం లభిస్తుంది.
సనక సనందాది మునులు విష్ణు దర్శనానికి వెళ్తే జయ,విజయులు (రాజస,తామస గుణాలు) అడ్డుకున్నారు. ఇది మనలో రాజస,తామస గుణాలు పరమాత్మ దర్శనానికి అడ్డుగా నిలుస్తాయని సూచిస్తుంది. వాటిని పక్కన పెట్టి సత్త్వగుణంతో (జ్ఞాన,భక్తితో) ప్రార్థిస్తే భగవంతుడు తానే దర్శనమిస్తాడు.ఉత్తరం అంటే “ఉత్ + తర” ఉత్కృష్టమైనది, అన్నిటికంటే గొప్పది. భగవద్దర్శనం కంటే గొప్పది ఏదీ లేదు. దానికి ద్వారం జ్ఞానం,భక్తి.ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. సూర్యకిరణాలు దేవతా శక్తులతో నిండి ఉంటాయి. సూర్యుడే ప్రత్యక్ష నారాయణుడు. గీతలో కృష్ణుడు “సూర్యునిలోని కాంతిని నేనే” అన్నాడు కదా!
ఏకాదశి యొక్క అంతరార్థం
మనలో ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఒక మనసు ఈ పదకొండు ఇంద్రియాలను భగవంతుడి వైపు మళ్లించడమే నిజమైన ఏకాదశి. ప్రహ్లాదుడు చెప్పినట్లు:
“కమలాక్షుని అర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ…”
ఈ పదకొండు ఇంద్రియాలతో భగవంతుని అనుభవించడం, శుద్ధి చేసుకోవడం ద్వారా ద్వాదశి (విష్ణు అధిపత్యం ఉన్న తిథి)లో ఆయనలో ఐక్యమవుతాం.ఏకాదశి ఉపవాసం ద్వాదశి పూజకు అర్హత ఇస్తుంది. ఇంద్రియాలను శుద్ధి చేసి, భక్తి-జ్ఞాన ద్వారాలు తెరుచుకుని పరమాత్మను దర్శిద్దాం.ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేయడం బాహ్య సంకేతం. కానీ నిజమైన ఉత్తర ద్వారం మనలోనే తెరుచుకోవాలి రాజస-తామస గుణాలను తొలగించి, సత్త్వగుణంతో సాధన చేయడం ద్వారా.
ఈ పర్వదినం సందర్భంగా అందరూ భక్తి-జ్ఞానాలతో శ్రీహరిని స్మరించి, మోక్షాన్ని పొందాలని కోరుకుందాం.
ఓం నమో నారాయణాయ! 🙏
సర్వే జనాః సుఖినో భవంతు!
లోకాః సమస్తాః సుఖినో భవంతు!
VaikunthaEkadashi











