ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రకృతి విలయం సంభవించింది. ఉత్తర కాశీ జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఖీర్ గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో ధరాలీ, ఖీర్‌గడ్ గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ హఠాత్తుగా సంభవించిన ప్రకృతి విపత్తులో వందలాది ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి.
భీకర వరదల్లో నలుగురు మృతి, 60 మంది గల్లంతు ఈ విపత్తులో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. 60 మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇంకా పలువురు మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని భయపడుతున్నారు. నదిలో వచ్చిన అకస్మాత్తు వరదల వల్ల ఇళ్లు, రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ మట్టితో, రాళ్లతో నిండిపోయాయి. Also Read – ప్రత్యేకించి ఆ రాష్ట్రంలో మహిళలకు నైట్ షిఫ్ట్.. కానీ కండీషన్స్ అప్లై ! సహాయక చర్యల్లో నిమగ్నమైన బృందాలు సమాచారం అందిన వెంటనే సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పర్వతాల నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద నీరు ప్రజల్లో భయాందోళనలు సృష్టించింది. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. సీఎం ధామి స్పందన, కేంద్రం భరోసా ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ సీనియర్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నారు. “ధరాలీలో జరిగిన నష్టం చూసి చాలా బాధ కలిగింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. వారికి అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని ఆయన అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ధామికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. “రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. కేంద్రం అన్ని విధాలా రాష్ట్రానికి అండగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ మరో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదుల వద్దకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.