అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలను ముందుకు తెస్తూ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల పౌరులకు వీసా జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
ఈ నిర్ణయంతో అమెరికాకు వెళ్లాలనుకునే వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. వీసా స్క్రీనింగ్‌ను మరింత కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నిషేధ జాబితాలో రష్యా, అఫ్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, నైజీరియా, థాయ్‌లాండ్, యెమెన్, బ్రెజిల్, పాకిస్తాన్, నేపాల్ వంటి కీలక దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే వీసా దరఖాస్తులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయనున్నట్లు సమాచారం.
అయితే ఈ నిర్ణయం వల్ల భారత్, చైనా దేశాలకు మాత్రం తాత్కాలిక మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఊరట చెందుతున్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది.
ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చలకు దారితీస్తుండగా, మానవ హక్కుల సంస్థలు, వలసదారుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Trump






