అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు.. ముఖ్యంగా STEM-OPT (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) ప్రోగ్రాం కింద పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు.. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలకు గురవుతున్నారు. అధికారుల బృందాలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రాం కింద పనిచేస్తున్న విద్యార్థుల ఇళ్లకు, హాస్టళ్లకు ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది.
USCIS (యూఎస్ సిటిజన్ షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ) లోని ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ (FDNS) విభాగానికి ఈ తనిఖీలు చేసే అధికారం ఉంది. విద్యార్థులు సమర్పించిన ట్రైనింగ్ ప్లాన్లు (Form I-983) వారి చదువుకు, ఉద్యోగానికి మధ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడమే ఈ ఆకస్మిక తనిఖీల ముఖ్య ఉద్దేశం. STEM రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 2 సంవత్సరాల OPT అనుమతి లభిస్తుంది. దీంతో వారికి మొత్తం 3 సంవత్సరాల పాటు అమెరికాలో పని అనుభవం పొందే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు తమ F-1 వీసా స్టేటస్‌ను సరైన రీతిలో కొనసాగిస్తున్నారా లేదా, కేవలం వీసా పొడిగింపు కోసం నకిలీ సంస్థల్లో పనిచేస్తున్నట్టు చూపిస్తున్నారా అనే అంశాలను ధృవీకరించుకోవడానికి ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
ఫ్లోరిడా అడ్వకేట్ అశ్విన్ శర్మ ప్రకారం.. ఇలాంటి ఇన్స్పెక్షన్లు చట్టబద్ధమైనవే అయినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే, వీసా దరఖాస్తులకు సంబంధించి RFEs (రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్) కూడా అధికమయ్యాయి. సాన్‌జోస్ లాయర్ అభినవ్ త్రిపాఠి అభిప్రాయం ప్రకారం.. విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి తనిఖీలు చేయడం సాధారణ నియమాల్లో లేదు. అయితే విద్యార్థులు తమ Form I-983లో నివాసాన్నే వర్క్ ప్లేస్‌గా చూపినప్పుడు మాత్రం అధికారులకు ఆ అధికారం ఉంటుంది.
తనిఖీకి వచ్చే అధికారులు ప్రధానంగా విద్యార్థిని ఈ కింది విషయాలపై ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి స్టడీస్, అటెండెన్స్ వివరాలు… ఉద్యోగ బాధ్యతలు, వర్క్ అవర్స్ మరియు సాలరీ డిటైల్స్… ఉద్యోగం చదివిన డిగ్రీకి ఎలా సంబంధం కలిగి ఉందో వివరణ ఇవ్వాలి. పాస్‌పోర్ట్, EAD కార్డు, ఆఫర్ లెటర్, పేస్లిప్స్, రిజ్యూమ్, ట్రాన్స్‌క్రిప్ట్స్ వంటి అన్ని కీలక పత్రాలను అడుగుతున్నారు.
ఈ కఠిన చర్యల ప్రభావం ఎక్కువగా భారతీయ విద్యార్థులపైనే పడుతోంది. 2023–24 ఓపెన్ డోర్స్ రిపోర్టు ప్రకారం.. అమెరికాలో చదువుతున్న 3.3 లక్షల భారతీయ విద్యార్థులలో, 97,556 మంది OPT ప్రోగ్రాం కింద ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది STEM రంగాల్లో ఉండటంతో ఈ ఆకస్మిక తనిఖీలు వీరికి కొత్త సవాళ్లను తెస్తున్నాయి. బైడెన్ పాలనలో కాస్త తగ్గిన ఈ తనిఖీలు, ట్రంప్ సర్కారు మళ్లీ వాటిని కఠినతరం చేసింది. H-1B వీసాలపై కఠిన విధానాలు, పెరిగిన ఫైలింగ్ ఫీజులు, ఇప్పుడు F-1 OPT విద్యార్థులపై ఈ తనిఖీలు.. ఇవన్నీ అమెరికాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు కొత్త ఆందోళనను కలిగిస్తున్నాయి.
విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పక పాటించాలి. Form I-983ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. అన్ని వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగం లేదా అడ్రస్ మార్పులు USCIS పోర్టల్‌లో 10 రోజుల్లోపు అప్‌డేట్ చేయాలి. DSO (డిసిగ్రేటెడ్ స్కూలు అఫీషియల్)కు మార్పుల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలి. అధికారుల ఇంటర్వ్యూల సమయంలో శాంతంగా, నిజాయితీగా మాత్రమే సమాధానాలు ఇవ్వాలి. తనిఖీకి వచ్చిన అధికారుల ఐడెంటిటీని ధృవీకరించాలి (బిజినెస్ కార్డ్ లేదా బ్యాడ్జ్ నంబర్ అడగాలి). భారతీయ విద్యార్థులు తమ వీసా స్టేటస్, ఉద్యోగ వివరాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.