అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. హెచ్1బీ వీసాల నుంచి, ప్రపంచ దేశాలపై సుంకాల దాడుల వరకూ ఆయన నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతుండగా.. మరొకొన్ని నిర్ణయాలు కోర్టు మెట్లెక్కుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీసాపై ట్రంప్ నిర్ణయాధికారాన్ని సవాల్ చేశారు.
అవును… అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై వరుసగా కోర్టులు.. ఆ ఆర్డర్ అమలు సాధ్యం కాదని చెబుతున్న వేళ.. ట్రంప్ తీసుకున్న మరో తాజా నిర్ణయంపైనా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో భాగంగా… హెచ్-1బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టులో దావా దాఖలైంది.
ఈ సందర్భంగా… హెచ్-1బీ వీసా అనేది కాంగ్రెస్ నిర్ణయం ద్వారా అమల్లోకి వచ్చినందువల్ల.. దాన్ని సవరించడానికి కానీ, రద్దు చేయడానికి కానీ అధికారం కాంగ్రెస్ కే ఉంటుందని పిటిషనర్లు వాదిస్తున్నారు. అసలు రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంబంధమైన నిర్ణయాలను తీసుకోవలసింది అమెరికా కాంగ్రెస్ మాత్రమేనని ఈ సందర్భంగా పిటిషనర్ పేర్కొన్నారు
ఇదే సమయంలో… హెచ్-1బీ వీసాను కేవలం టెక్ నిపుణులకు మాత్రమే ఇవ్వడం లేదని.. దాన్ని పొందేవారిలో మూడోవంతు మంది వైద్యులు, నర్సులు, అధ్యాపకులు, పాస్టర్లు, విద్వాంసులేనని పిటిషన్ పేర్కొంది. అధిక ఫీజుతో ఈ వీసాలకు అడ్డుకట్ట వేస్తే టెక్ కంపెనీలు మాత్రమే కాకుండా వైద్యసేవలు, విద్యా సంస్థల్లో కూడా ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని వివరించింది.
ఇదే సమయంలో… ఈ వీసాల విషయంలో అధిక ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రికి కట్టబెట్టడం.. అవినీతి, పక్షపాతానికి దారితీస్తుందని పిటిషనర్లు విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల విదేశాల నుంచి పరిశోధకుల రాకపోకలు నిలచిపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ వీసా ఉత్తర్వును నిలిపివేసి కంపెనీలకూ, కార్మికులకు ఊరట ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ దావాను వేసినవారిలో అమెరికా కంపెనీల యాజమాన్యాలతోపాటు దేశ ఆటో కార్మికుల యూనియన్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల సంఘం, నర్సుల నియామక సంస్థ, పలు మతపరమైన సంఘాలూ ఉన్నాయి.