బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దబిడి దిబిడి పాటతో తెగ వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. అక్కడి రెడ్ కార్పెట్‌పై హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. అంతే కాకుండా పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్లో ఎంతో మంది స్టార్స్ ఉండగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం తనకు దక్కడం పట్ల ఊర్వశి రౌతేలా చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలో ఈమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫోటోలు, వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈమె గురించి ట్రోల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై ఊర్వశి రౌతేలా నడిచిన సందర్భంలో ధరించిన డ్రెస్ గతంలో ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సమయంలో ధరించిన డ్రెస్‌ను పోలి ఉంది అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విషయంపై స్వయంగా ఊర్వశి స్పందించాల్సి వచ్చింది. అంతే కాకుండా ఊర్వశి రౌతేలా పొడవాటి డ్రెస్‌ను ధరించి వేదిక వద్ద ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చేందుకు చాలా సమయం తీసుకుంది. దాంతో మెట్ల వద్ద చాలా మంది అసౌకర్యంకు గురి అయ్యారు. ఆమె మెట్లకు అడ్డుగా ఉండటంతో పాటు, ఆమె డ్రెస్ పెద్దగా ఉండటం వల్ల ఇతర సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారు అంటూ నెటిజన్స్ అసహనం వ్యక్తం చేశారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు రోజుల పాటు సందడి చేసిన ఊర్వశి రౌతేలాను ఈ రెండు విషయాల పట్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఊర్వశి స్పందించింది. తాను ఎవరినో ఫాలో కాలేదు, నాకంటూ ప్రత్యేక శైలి ఉంది, నా స్టైల్లో నేను కేన్స్‌లో కనిపించాను. కొందరు కావాలని నా డ్రెస్‌ను, నా స్టైల్‌ను కాపీ అంటూ ప్రచారం చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందని ఊర్వశి రౌతేలా అసహనం వ్యక్తం చేసింది. నన్ను నకిలీ అంటూ ప్రచారం చేస్తున్న వారి గురించి తెలుసు. కానీ నేను ఎప్పుడూ నకిలీ కాదు, నేను ఒరిజినల్ అంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతేలా నకిలీ అంటూ కొందరు చేస్తున్న ట్రోల్స్‌కి గట్టి సమాధానంను ఇచ్చింది.
ఇదే సమయంలో మెట్లకు అడ్డుగా ఉన్నావు అంటూ చేస్తున్న విమర్శలపై కూడా ఊర్వశి రౌతేలా స్పందించింది. నా ఫోటో షూట్ కారణంగా మెట్ల దారిని బ్లాక్ చేశానంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ముందుగానే నేను అక్కడ ఫోటోలను దిగేందుకు అనుమతి తీసుకున్నాను. కేన్స్ వేడుకలో పాల్గొన్న సమయంలో నేను అక్కడి ప్రతి రూల్ పాటించాను, అక్కడి వారి నిర్ధేశం ప్రకారం నడుచుకున్నాను. అక్కడి వారిని గౌరవిస్తూ, అక్కడ నిబంధనలను గౌరవిస్తూ నేను రెడ్ కార్పెట్ పై వాక్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. కొందరు కావాలని తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఊర్వశి రౌతేలా అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోను, మీరు నన్ను ట్రోల్ చేసినంత మాత్రాన నేను మిమ్ములను ట్రోల్ చేయడానికి డబ్బు వృద్ధా చేసుకోను అంటూ ఊర్వశి రౌతేలా గట్టి కౌంటర్ ఇచ్చింది.