బాలీవుడ్ ని మాఫియా నుంచి విడిగా చూడలేం. 80లు, 90లలో మాఫియా కనుసన్నల్లో చిత్ర పరిశ్రమ నడిచేది. సినిమాల నిర్మాణం, ఆర్టిస్టుల ఎంపిక సహా దర్శకుడు ఎవరో డిసైడ్ చేసేది మాఫియానే. ఎవరైనా నిర్మాత చెప్పిన మాట వినికపోతే తూటాకు బలవ్వాల్సిందే. అప్పట్లో తాను రికమండ్ చేసిన హీరోయిన్ కి అవకాశం ఇవ్వలేదని ఒక నిర్మాతనే లేపేసాడు గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం.
చిత్ర పరిశ్రమ బిక్కు బిక్కుమంటూ బతుకు సాగించేది. అయితే అప్పట్లోనే దేవానంద్ లాంటి పెద్ద స్టార్ సరసన నటించిన పాకిస్తానీ నటి అనితా అయూబ్ ని దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించాడని కథనాలొచ్చాయి. అయూబ్ కారణంగానే నిర్మాత సిద్ధిఖి హతమయ్యాడు. అయూబ్ కి అవకాశం కల్పించలేదని సిద్ధిఖీని దావూద్ చంపినట్లు కథనాలొచ్చాయి. నటీనటులను బెదిరించి వారి వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసిన డాన్ గా దావూద్ గురించి చాలా చర్చ సాగేది. ముఖ్యంగా మందాకిని, అయూబ్ వంటి ప్రముఖ నటీమణుల జీవితాలను దావూద్ తీవ్రంగా ప్రభావితం చేసాడని అప్పట్లో మీడియా కథనాలొచ్చాయి.
అనితా అయూబ్ నేపథ్యం వివరాల్లోకి వెళితే…. పాకిస్తాన్ కరాచీలో జన్మించింది. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన అనిత నటనాభిరుచిని కొనసాగించడానికి ముంబై(భారత్)లోని రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. మొడలింగ్ తో మొదలై సినీనటిగా ఎదిగింది. ప్రముఖ నటుడు, ఫిలింమేకర్ దేవ్ ఆనంద్ ఆడిషన్స్ చేసి ఎంపిక చేసుకున్నారు. ఆమె అద్భుతమైన అందం, నటనకు ముగ్ధుడైన దేవ్ ఆనంద్ తన చిత్రం `ప్యార్ కా తరానా` (1993)లో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత సూపర్‌హిట్ చిత్రం `గ్యాంగ్‌స్టర్`లో కూడా అయూబ్ నటించింది. అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న పుకార్లు సంచలనంగా మారాయి. అతడితో అయూబ్ పబ్లిక్ లో కనిపించేది. అనిత అయూబ్ కి అవకాశం కల్పించేందుకు నిరాకరించిన నిర్మాత జావేద్ సిద్ధిఖీని కాల్చి చంపారని కూడా ప్రచారమైంది. ఒకానొక దశలో అనిత దావూద్ గూఢచారి అని అనుమానించారు. ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించలేదు. అయితే అనితపై అనుమానాలు పరిశ్రమ నుంచి బ్లాక్ లిస్ట్ చేయడానికి కారణమైంది.
చివరిగా అనిత పాకిస్తాన్ కు తిరిగి వెళ్లి, తరువాత భారతీయ వ్యాపారవేత్త సౌమిల్ పటేల్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు షెజార్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఈ బంధం బ్రేక్ అయింది. ఆ తర్వాత ఆమె పాకిస్తానీ వ్యాపారవేత్త సుబాక్ మజీద్‌ను వివాహం చేసుకుని చివరికి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. గొప్ప నటిగా ఓ వెలుగు వెలిగినా అయూబ్ అనూహ్యంగా పరిశ్రమ నుంచి మాయమైంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన అనితా అయూబ్, ఒక క్షణికమైన కల కంటే త్వరగా మాయమైంది.