అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీల మధ్య జరిగిన తాజా భేటీ ఆసక్తికరమైన పరిణామాలకు వేదికైంది. మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దారులు వెతికే క్రమంలో శ్వేతసౌధంలో వీరు సమావేశమయ్యారు. ఈ సమావేశం కేవలం గంభీరమైన చర్చలతోనే కాకుండా, హాస్యభరిత వాతావరణాన్ని కూడా సృష్టించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జెలెన్‌స్కీ, ట్రంప్‌ల మధ్య వైట్‌హౌస్‌లో భేటీ జరిగినప్పుడు జెలెన్‌స్కీ సాధారణ టీషర్ట్‌తో వచ్చారు. ఆ సమయంలో అమెరికా మీడియా ప్రతినిధులు ఆయన డ్రెస్సింగ్‌పై విమర్శలు గుప్పించారు. కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ నేరుగా “మీరు ఎందుకు సూట్ వేసుకోలేదు? ఇది అమెరికా అత్యున్నత కార్యాలయం. అసలు మీ వద్ద సూట్ ఉందా?” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి జెలెన్‌స్కీ స్పందిస్తూ “యుద్ధం ముగిసిన తర్వాత తప్పకుండా సూట్ వేసుకుంటా” అని సమాధానమిచ్చారు.
తాజా సమావేశంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి జెలెన్‌స్కీ శుభ్రమైన సూట్‌లో వచ్చారు. ఆయన దుస్తులపై ప్రశంసలు కురిసాయి. గతంలో విమర్శించిన రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్నే ఈసారి “ఈ సూట్‌లో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు” అంటూ పొగిడారు. ఇక్కడే ట్రంప్ జోక్యం చేసుకొని హాస్యం పండించారు. “గతంలో మీపై మాటలతో ‘అటాక్’ చేసింది కూడా ఈ విలేఖరేనండోయ్” అంటూ జెలెన్‌స్కీకి గుర్తు చేశారు. దీనికి జెలెన్‌స్కీ నవ్వుతూ “అవును, నాకు గుర్తుంది. కానీ మీరు మాత్రం అదే సూట్‌లో ఉన్నారు, నేను మాత్రం కొత్తదాన్ని వేసుకున్నాను” అని గ్లెన్‌ను ఉద్దేశించి అన్నారు. దీనితో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.
ఈ హాస్యభరిత క్షణాల మధ్య ప్రధాన చర్చ మాత్రం యుద్ధం ముగింపు దిశగా సాగింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలకడానికి అవసరమైన చర్యలపై ఇద్దరు నాయకులు సానుకూల ప్రకటనలు చేశారు. ఈ సమావేశం ఒకవైపు శాంతి ప్రయత్నాలకు మార్గదర్శకంగా నిలిస్తే, మరోవైపు జెలెన్‌స్కీ సూట్‌పై జరిగిన చమత్కారాలు ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించాయి.