ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు బాసటగా నిలిచారు. గత ఎన్నికలకు ముందు కర్నూలుకు చెందిన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని బాలిక తల్లి పార్వతి కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన పవన్ ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో తన ఆవేదన వెలిబుచ్చారు. ప్రీతి హత్య కేసును తానే వెలుగులోకి తెచ్చి, ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా నిలిస్తే, ఇప్పుడు తననే విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సీబీఐ విచారణకు లేఖ రాశామని, సీబీఐ నిర్ణయం తీసుకోవాల్సివుందని వెల్లడించారు. అయితే ఈ విషయంపై పవన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. తన సహచరుడిపై విపక్షం చేస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు చంద్రబాబు బ్రహ్మస్త్రాన్నే సంధించారు. గతంలో రాసిన లేఖపై సీబీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోనందున మరోసారి సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ ఇంకో లేఖ రాయాలని నిర్ణయించారు. తక్షణం దర్యాప్తు ప్రారంభించేలా ఈ రోజే (గురువారం) లేఖ రాయాలని డీజీపీని సీఎం ఆదేశించారు. దీంతో పవన్ పై విపక్షం చేస్తున్న విమర్శల దాడికి ఫుల్ స్టాప్ పడేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలోనే సీబీఐ విచారణకు లేఖ రాసినా, ఎందుకనో దర్యాప్తు మొదలు కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లేఖను చూపుతూ అధికారులు ఇన్నాళ్లు కాలం గడిపేశారని అంటున్నారు. అయితే హతురాలి తల్లి విమర్శలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
2017లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుగాలి ప్రీతి హత్య జరిగింది. ఆ ఏడాది ఆగస్టు 18న కర్నూలులో హాస్టల్ లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ప్రీతి మృతదేహం కనిపించింది. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలోనూ ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కానీ నేరస్తులు ఎవరో ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. కొందరు అనుమానితులను అరెస్టు చేసినా, సరైన సాక్ష్యాధారాలు లేవని వారు బెయిలుపై బయటకు వచ్చారు. అయితే నిందితులకు ఓ పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా రావడంతో సుగాలి ప్రీతి కేసు రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యంశంగా మారిపోయింది. హతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.
దీంతో సుగాలి ప్రీతి హత్యోదంతంపై వైసీపీ ప్రభుత్వం కూడా ఒత్తిడికి లోనైంది. ఈ విషయంపై గత ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి శిక్షిస్తామని డిప్యూటీ సీఎం పవన్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఎక్కువగా పవన్ హామీపైనే హతురాలి కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. తొలి నుంచి జనసేనాని మాత్రమే తమకు అండగా నిలిచారని, ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో ఆలస్యం జరగడంతో హతురాలి తల్లి ఈ మధ్య విమర్శలు గుప్పించారు. అదే అదునుగా వైసీపీ కూడా జనసేనానిని టార్గెట్ చేసింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని పవన్ పై విమర్శల దాడిని తప్పించేలా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇది కూటమి నేతల ఐక్యతకు, మంచి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు పనికొచ్చిందని అంటున్నారు.