వైసీపీ ఓటమి పాలు అయి ఏకంగా పదిహేను నెలలు పైదాటింది. టీడీపీ కూటమి పాలన కూడా పావు వంతు పూర్తి అయింది. ఇపుడు జనంలో ఉంటూ ప్రజా పక్షంగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి మేలు చేస్తాయా లేక చేటు తెస్తాయా అన్న చర్చ సాగుతోంది. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు అని ప్రచారంలో ఉంది. ఆయన ఇంకా వైసీపీ ఘోర ఓటమి మీద పోస్టు మార్టం చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఎందుకు ఓడిపోయిందో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. మరోసారి అదే మాట చెప్పారు.
వైసీపీ ఎందుకు ఓడింది అన్నది సామాజిక గణాంకాలతో సహా ఆయన వివరించారు. అయితే ఇవి ఇపుడు అవసరమా అన్న చర్చ ఒక వైపు ఉంటే ఆయన చేసిన ఈ విశ్లేషణ అయితే కొంత ఆసక్తిగానే ఉంది అని అంటున్నారు. ఆయన వైసీపీ అధినాయక్త్వానికి తెలియాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. జగన్ నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఎంతగా చెప్పుకున్నా పోలింగ్ బూత్ ల వద్ద అవేమీ వర్కౌట్ కాలేదని కుండబద్దలు కొట్టారు.
ఇక వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎవరెంత మద్దతుగా నిలిచారు అంటూ ఆయన చెప్పిన లెక్కలు ఇపుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కాపులు ఇరవై శాతం, బీసీలు 30 నుంచి 35 శాతం, రెడ్లు యాభై శాతం మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచి ఓట్లేశారు అని గుడివాడ చెప్పుకొచ్చారు. అదే ఎస్సీలు మాత్రం నూటికి 75 శాతం మంది ఓట్లేశారు అని ఆయన చెప్పారు. బీసీలు అగ్ర కులాలు అయితే వైసీపీని అంతగా ఆదరించలేదు అని లోగుట్టు గుడివాడ బయటపెట్టేశారు.
అయితే గుడివాడ చెబుతున్న దానిలో వాస్తవం ఉందని పార్టీ వర్గాలలో కూడా అంటున్నారు. కానీ ఇపుడు బహిరంగంగా చర్చించుకోవాల్సింది ఏముంది అన్నదే వారి మాట. పైగా ఈ వర్గాలను ఎలా మచ్చిక చేసుకోవాలి అన్నది ఆలోచించాలి కానీ వారు ఓటేయలేదని చింతించి ఒకింత ఆగ్రహం ప్రకటిస్తే వచ్చే లాభం లేకపోగా నష్టమే వస్తుందని అంటున్నారు. ఇక వీరంగా ఎందుకు ఓట్లేయలేదో కూడా పార్టీ ఈపాటికే సమీక్షించుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఏపీలో కీలక సామాజిక వర్గాలు 2019లో వైసీపీకి ఓటేసి 2024 నాటికి దూరం అయ్యారు అంటే ఎందుకు వారంతా దూరం అయ్యారన్న దాని మీద నిజాయతీతో కూడిన విశ్లేషణ జరగాలని అంటున్నారు.
ఇక వైసీపీని 2014, 2019లలో అక్కున చేర్చుకున్న రెడ్లు కూడా 2024 కి వచ్చేసరికి సగానికి సగం మంది ఆదరించలేదు అన్నది గుడివాడ మార్క్ విశ్లేషణ. ఇందులో కూడా నిజం ఉందని దాని ఫలితమే రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం అని అంటున్నారు. మరి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర తీసేందుకు అధినాయకత్వం తన వంతుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే బీసీలు కానీ కాపులు కానీ ప్రతీ ఎన్నికకూ మద్దతు విషయంలో తమ ఆలోచనలు మార్చుకుంటారు కాబట్టి వారి మన్ననలు పొందే విషయంలో వైసీపీ కార్యాచరణ రూపొందించాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం గుడివాడ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలమే రేపుతున్నాయని చెప్పక తప్పదు.