జనసేన పార్టీలో సమూల మార్పుల దిశగా ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణకు పెద్ద పీట వేస్తున్నారు. గత నెలలో నిర్వహించిన `సేనతో సేనాని` కార్యక్రమంలో ప్రకటించిన `త్రిశూల్` వ్యూహానికి పదును పెంచారు. తాజాగా నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ వ్యవహారంపై ఆయన చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోనూ భేటీ అయిన పవన్ కల్యాణ్.. పార్టీ అంతర్గత అంశాలపైసుదీర్ఘంగా వారిని అడిగి తెలుసుకున్నారు. వివాదాస్పద నాయకులు, వివాదాస్పద వ్యవహారాలు వంటివాటిపై నిశితంగా ప్రశ్నించారు.
అనంతరం.. త్రిశూల్ వ్యూహాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ కూడా.. గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదన వినిపిస్తున్నవారు.. వందల్లోనే ఉన్నారని చెప్పిన పవన్ కల్యాణ్‌వారికి న్యాయం జరగాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా.. వారి చెంతకు వెళ్లి.. వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఎక్కడా నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యతను కూడా వారికే అప్పగించారు. అదేసమయంలో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. త్రిశూల్‌లో తొలి కార్యాచరణ ప్రకారం.. ఎక్కువ మంది యువతకు అవకాశం ఇవ్వనున్నారు.
వారితో ఉన్న నాయకత్వ లక్షణాలను వెలుగులోకి తీసుకువచ్చి.. వారిని పార్టీకి అనుకూలంగా మార్చుకుంటారు. మరీ ము ఖ్యంగా నాయకులకు చేరువ కావడం పట్ల ఎక్కువగా ఫోకస్ పెడతారు. ప్రస్తుతం పార్టీలో ఒక నిర్వేదం అయితే కనిపిస్తోందని అన్నారు. “నేను వస్తేనే పార్టీ వచ్చినట్టు కాదు. మీరు వెళ్లినా.. అదే తరహా పరిస్థితి ఉండాలి. ఇలా ఎందుకు ఉండడం లేదో మీరు ఆలోచించుకోవాలి. నేను వచ్చినప్పుడు.. అనేక సమస్యలు చెబుతున్నారు. కానీ, మీరు వెళ్లినప్పుడు అదే నాయకులు, కార్యకర్తలు ఎందుకు చెప్పడం లేదు.“ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఇక, ఇదేసమయంలో అసెంబ్లీ హాజరు, ప్రశ్నలు సంధించిన తీరుపై కూడా పవన్ ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. ఒకరిద్దరు ముక్తసరిగా సభలో హాజరయ్యారని కూడా నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. ఎలాంటి హోం వర్క్ చేయకుండానే సభకు ఎందుకు వచ్చారని వారిని ప్రశ్నించారు. అదేసమయంలో వివాదాస్పద అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన క్లాస్ తీసుకున్నారు. ముందుగా అందరితోనూ.. తర్వాత ఒక్కొక్కరుగా కూడా పవన్ భేటీ అయ్యారు. పార్టీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని.. అందరినీ కలుపుకొని పోవాలని నాయకులకు సూచించారు. దీంతో జనసేనలో ఇక, పవనిజం పుంజుకుంటుందన్న సూచనలు ఇవ్వకనే ఇచ్చారని అంటున్నారు.