ఇటీవల విశాఖపట్నం వేదికగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ `సేనతో సేనాని` కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమంలో `త్రిశూల్` అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో తాము చేస్తున్న పనులను చెప్పుకొచ్చారు. ఇది సహజంగా జనసేనలో ఉన్న నాయకులకు సంతృప్తి అయితే కలిగించలేదు. ప్రజా ప్రతినిధులకు సంతృప్తి కలిగించి ఉండొచ్చు.
కానీ, పార్టీ పరంగా చూసుకున్నప్పుడు జనసేన నాయకులు కోరుకుంటున్నది వేరు. జనసేన అధినేత చేస్తున్నది వేరు. అనే చర్చ తెరమీదకు వచ్చింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశం తనకు ఉందని పవన్ కళ్యాణ్ చెబుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా వేచి చూద్దాం.. అన్న ధోరణిలోనే ఉన్నారు. త్రిశూల్ కార్యక్రమాల ద్వారా బలమైన కార్యకర్తలను పార్టీకి అందిస్తామని ఆయన చెప్పకురావడం మంచిదే. అయినప్పటికీ, ప్రస్తుతం పార్టీలో కీలకమైన పదవులు ఖాళీగా ఉన్నాయి.
అసలు వాటి గురించిన చర్చ కూడా లేదన్నది సైన్యం చెబుతున్న మాట. పార్టీకి అధికార ప్రతినిధులు అంటూ ఎవరూ లేరు. వాస్తవానికి ప్రతి జిల్లాకు ఇద్దరిని చొప్పున అధికార ప్రతినిధులను నయమించే అవకాశం ఉంది. ఇది టిడిపిలోనూ వైసీపీలోను కనిపిస్తుంది. సరే వారు మీడియా ముందుకు వస్తున్నారా మాట్లాడుతున్నారా లేదా అనే విషయాలను పక్కన పెడితే కనీసం అధికార ప్రతినిధులను నియమించే అవకాశం పార్టీకి ఉన్నప్పుడు ఆదేశగా జనసేన ఎందుకు ప్రయత్నించటం లేదన్నది కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న.
ఇక `వీర మహిళల` విషయానికి వస్తే వీరు కూడా తమ సమస్యలను పరిష్కరించలేదని తమ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర మహిళ విభాగం జనసేనకు అత్యంత కీలకంగా మారింది. వైసిపి చేసే విమర్శలకు వీర మహిళలు ఒకప్పుడు కౌంటర్ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు వీర మహిళలు ఎక్కడా కనిపించడం లేదు. వివాదాల్లో చిక్కుకున్నవారు కొందరు అయితే, పార్టీ తరఫున తమకు ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదని ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని చేతిలో రూపాయి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని బలవపేతం చేసేందుకు జనసేన అధినేతగా ఆయన ఎటువంటి దిశ నిర్దేశం చేయలేదన్నది వారు చెబుతున్న మాట. ఎలా చూసుకున్న రాష్ట్రవ్యాప్తంగా జనసేన పుంజుకోవాలన్న ఆకాంక్ష అయితే కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇప్పటికి ఇప్పుడు పదవులు ఇచ్చే దిశగా కానీ ప్రాధాన్యం ఇచ్చేదిగా కానీ పవన్ కళ్యాణ్ అడుగులు వెయ్యకపోవడం పార్టీలో సేనలను మానసికంగా ఇబ్బంది పెట్టింది అన్నది వాస్తవం.