‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ
నటీనటులు: సత్య రాజ్- వశిష్ఠ సింహా- ఉదయ భాను- సత్యం రాజేష్- క్రాంతి కిరణ్- సాంచీ రాయ్- మేఘన- వీటీవీ గణేష్-మొట్ట రాజేంద్రన్ తదితరులు
సంగీతం: ఇన్ఫ్యూజన్ బ్యాండ్
ఛాయాగ్రహణం: కుశేందర్ రెడ్డి
నిర్మాత: విజయ్ పాల్ రెడ్డి అడిదల
రచన- దర్శకత్వం: మోహన్ శ్రీవత్స
త్రిబాణధారి బార్బరిక్.. ఇలాంటి టైటిల్ తో సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగింది. సత్యరాజ్ ముఖ్య పాత్రలో మోహన్ శ్రీవత్స రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ తోనూ ఆకట్టుకుంది. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
శ్యామ్ కతు (సత్యరాజ్) ఓ సైకియాట్రిస్ట్. తన కొడుకు కోడలు చనిపోవడంతో మనవరాలు నిధి (మేఘన)ను ప్రేమగా పెంచుతూ ఆమెనే ప్రాణంగా జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు స్కూలుకు వెళ్లిన నిధి ఎంత రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కంగారుపడి శ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ చంద్రం (సత్యం రాజేష్)తో కలిసి నిధిని వెతికే పనిలో పడతాడు శ్యామ్. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు డబ్బు అవసరమైన రామ్ (వశిష్ఠ సింహా).. వాకిలి పద్మ (ఉదయభాను) అనే లేడీ డాన్ అల్లుడైన దేవా (క్రాంతి కిరణ్)తో కలిసి చట్ట విరుద్ధమైన పనులు చేస్తుంటాడు. నిధి కనిపించకుండా పోవడంలో వీరి పాత్ర ఏంటి.. ఇంతకీ నిధికి ఏమైంది? తన కోసం శ్యామ్ ఏం చేశాడు? అసలు బార్బరీకుడికి ఈ కథకి సంబంధం ఏంటి.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
విశ్లేషణ:
వర్తమానంలో జరిగే కథలకు.. చారిత్రక నేపథ్యంతో ముడిపెట్టడం.. డివైన్ ఎలిమెంట్ జోడించడం.. తద్వారా ప్రేక్షకులను కొత్త అనుభూతి పంచి బాక్సాఫీస్ సక్సెస్ అందుకోవడం.. ఇప్పుడు ట్రెండ్. కార్తికేయ-2.. కాంతార.. కల్కి.. ఇలా చాలా సినిమాలు ఈ ఫార్ములాతోనే ప్రేక్షకులను మెప్పించాయి. ఐతే ఈ ప్రయత్నం సహజంగా అనిపించాలి.. సింక్ కుదరాలి. అలా కాని పక్షంలో మొత్తం వంటకమే చెడిపోతుంది. ‘త్రిబాణధారి బార్బరిక్’లో దర్శకుడు ఎంచుకున్న ‘డివైన్’ ఎలిమెంట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.. దాన్ని ప్రస్తుత కథకు లింక్ చేయడానికి అతను గట్టిగానే కష్టపడ్డాడు. కానీ ‘సింక్’ మాత్రం అంత బాగా కుదరలేదు. అందుకు కారణం డివైన్ ఎలిమెంట్ ను అనుకున్నంత ప్రభావవంతంగా తెరపై ప్రెజెంట్ చేయలేకపోవడమే. కానీ దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. వాట్ నెక్స్ట్ అంటూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచగలిగాడు. కథలో సస్పెన్సును మెయింటైన్ చేయడంలో.. కొన్ని ట్విస్టుల వరకు ‘త్రిబాణధారి బార్బరిక్’ మెప్పిస్తుంది. రెండు గంటలు ఒక మోస్తరుగా టైంపాస్ చేయించడంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ విజయవంతం అయింది.
త్రిబాణధారి బార్బరిక్.. చాలా వింతగా అనిపించిన టైటిలిది. ఇలాంటి టైటిల్ పెట్టి ఏం సినిమా తీశారో అనే క్యూరియాసిటీ కలిగి ఉంటుంది ప్రేక్షకులకు. బార్బరిక్ అంటే ఘటోత్కచుడి కొడుకు. కేవలం మూడు బాణాలతో యుద్ధాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉండడం తన ప్రత్యేకత. ఈ పాయింటుకి.. ఈ సినిమాలో కథకు ఏం సంబంధం అన్నదే కీలకం. ఈ విషయంలో ప్రేక్షకుల అంచనాలను మ్యాచ్ చేసే స్థాయిలో రెంటినీ లింక్ చేయలేకపోయాడు దర్శకుడు. ఐడియా వినడానికి క్రేజీగా అనిపించినా.. అది తెరపై అంత ప్రభావవంతంగా అనిపించదు. అందువల్ల ఇంపాక్ట్ తగ్గింది. ఐతే బార్బరీకుడికి సంబంధించిన ఓవరాల్ స్టోరీ కొంచెం ఆసక్తి రేకెత్తించడమే కాక.. దీనికి వర్తమానంలో కథకు ఎలా లింక్ పెడతారనే ఆసక్తి సినిమాను ముందుకు నడిపిస్తుంది. చివరికి ఇది సగటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. రివెంజ్ డ్రామాను మిక్స్ చేసిన సినిమాలా అనిపించినా.. వాట్ నెక్స్ట్ అనిపించేలా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ కొంతమేర విజయవంతమైంది.
సినిమాలో తాత- మనవరాలు ఎమోషన్ బాగానే వర్కవుట్ అయింది. కానీ చాలా సీన్లు నెమ్మదిగా నడుస్తాయి. చిన్న చిన్న లాజిక్స్ వదిలేశారు. కానీ తప్పిపోయిన నిధిని వెతకడంలో సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ సమయానికి మంచి ట్విస్ట్ ఇచ్చి తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్టులు కూడా బాగున్నాయి. బార్బరీకుడికి సంబంధించి సన్నివేశాలు మాత్రం ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. 2 గంటలకు కాస్త ఎక్కువ నిడివితో ఉండడం సినిమాకు ప్లస్. ప్రథమార్ధంలో అనేక లేయర్లతో సాగే స్క్రీన్ ప్లే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. కానీ కథలో సస్పెన్స్.. కొన్ని ట్విస్టులు.. బార్బరీకుడికి సంబంధించిన పాయింట్.. సినిమాలో చెప్పుకోదగ్గ సానుకూలాంశాలు. రొటీన్ థ్రిల్లర్ కథే అయినా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉండడం.. కొన్ని మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
నటీనటులు:
వేరియేషన్లు ఉన్న శ్యామ్ కతు పాత్రను సత్యరాజ్ బాగా చేశాడు. తాత పాత్రలో ఎమోషన్లను పండిస్తూనే.. మైథాలజీ టచ్ ఉన్న గెటప్ లోనూ ఆకట్టుకున్నాడు. ఆయన విగ్రహం అందుకు తోడ్పడింది. మనవరాలి పాత్రకు మేఘన బాగా సూట్ అయింది. వశిష్ఠ సింహా మరోసారి ఆకట్టుకున్నాడు. అతడికి జోడీగా నటించిన సాంచీ రాయ్ క్యూట్ గా కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నటన కూడా పర్వాలేదు. ఒకప్పటి యాంకర్ ఉదయభాను చాన్నాళ్ల తర్వాత ఈ చిత్రంతోనే వెండి తెరపై కనిపించింది. ఐతే లేడీ డాన్ క్యారెక్టర్లో తన నటన బాగున్నా.. ఆ పాత్రకు సూటయినా.. కథకు-ఆమె పాత్రకు పెద్దగా సంబంధం లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. కానిస్టేబుల్ పాత్రలో సత్యం రాజేష్ చక్కగా నటించి మెప్పించాడు. క్రాంతి కిరణ్.. వీటీవీ గణేష్.. మొట్ట రాజేంద్రన్.. కార్తికేయ దేవ్ వీళ్లంతా వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం:
త్రిబాణధారి బార్బరిక్ సాంకేతికంగా బాగానే అనిపిస్తుంది. కుశేందర్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. సినిమాలో చాలా వరకు రాత్రి.. వర్షంతో ముడిపడ్డ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టు విజువల్స్ బాగానే చూపించారు. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు ఓకే. రచయిత- దర్శకుడు మోహన్ శ్రీవత్స రొటీన్ క్రైమ్ కథను కొంచెం భిన్నంగా నరేట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కథనంలో బిగి తగ్గింది. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు కానీ.. కన్ఫ్య్యూజన్ లేకుండా కథను చెప్పలేకపోయాడు. ఈ విషయంలో ఇంకొంచెం కసరత్తు చెయ్యాల్సింది. దర్శకుడిగా శ్రీవత్స పనితనం ఓకే అనిపిస్తుంది.
రేటింగ్- 3/5