శత్రుదుర్భేద్యమైన వ్యవస్థల దేశంలో… ప్రజల ఖాతాలకే పెద్ద భద్రత!
మన దేశం డిజిటల్ భద్రతలో ప్రపంచానికి ఆదర్శం అన్నట్టు పాలకుల మాటలు వింటుంటే గర్వంతో ఛాతి ఉబ్బిపోతుంది. ఇప్పటివరకు ఒక్క బ్యాంక్ ఖాతా కూడా హ్యాక్ కాలేదు, ఒక్క రూపాయి కూడా పోలేదు అన్న ప్రచారం దేశవ్యాప్తంగా వినిపిస్తూనే ఉంది. పోలీస్ శాఖ వెబ్‌సైట్లు, ప్రభుత్వ పోర్టల్స్ అన్నీ ఇంత భద్రమట… వాటిని చూసి “ఈ దశాబ్దపు అత్యుత్తమ ప్యాకేజీ” అందుకున్న అన్‌ఎథికల్ హ్యాకర్ కూడా ఆశ్చర్యపోయాడట!
ఇంత అద్భుతమైన వ్యవస్థలు ఉన్నప్పుడు ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే ప్రజల బ్యాంక్ ఖాతాలన్నీ ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానం చేసేయాలి అన్న ఆలోచన కూడా సహజంగానే పుడుతుంది. భద్రతకు భరోసా, ప్రజల డబ్బుకు ‘అభయ హస్తం’ ఇదే కొత్త పాలనా సూత్రమా?
ఇదిలా ఉండగా, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ ఉల్లంఘనల (Traffic Challan)విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు, ప్రజాస్వామ్యపరంగానూ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ట్రాఫిక్ వయలేషన్ జరిగిన క్షణంలోనే బ్యాంక్ ఖాతాల నుంచి చలాన్ కట్ చేయాలని, అందుకోసం ఖాతాలను లింక్ చేయాలని(BankAccount Linking) సూచించడం పాలనా ఉత్సాహమా? లేక అతి ఆతృతా?
ట్రాఫిక్ సమస్యలు కొత్తవేమీ కాదు. సిగ్నలింగ్ లోపాలు, రోడ్ల దుస్థితి, పోలీస్ వ్యవస్థలోని అవ్యవస్థ ఇవన్నీ ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న సమస్యలే. వాటిపై సమగ్రంగా పని చేయకుండా, ప్రజల ఖాతాలపై నేరుగా చేయి వేయాలన్న ఆలోచన ‘పాలన’ కంటే ‘ఆటవిక న్యాయం’లా కనిపిస్తోంది. పైగా, ఇలాంటి వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని కొందరు శాడిస్టు అధికారులు ప్రజలపై మరింత ప్రతాపం చూపే ప్రమాదం కూడా లేకపోలేదు.
ప్రభుత్వం నిజంగా సంస్కరణలు కోరుకుంటే, ట్రాఫిక్ లో జరిగే అక్రమ సెటిల్‌మెంట్లపై మాట్లాడాలి. పోలీస్ వ్యవస్థలో బాధ్యతను పెంచాలి, తప్పు చేసిన అధికారులపై శిక్షలు కఠినం చేస్తామని ప్రకటించాలి. అప్పుడు నిజమైన స్పందన ఎలా ఉంటుందో ప్రజలే చూపిస్తారు.
ఇంకో వైపు, నిన్న సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోర్టు సూచించింది. ‘విచారణ అర్హత లేదు’ అన్న వ్యాఖ్యలతో పిటిషన్ ముగిసింది. అప్పుడు సహజంగా తలెత్తే ప్రశ్న ఒక్కటే ఈ స్టడీ లేని పిటిషన్ కోసం ఎంత ప్రజాధనం ఖర్చైంది? ఆ ఖర్చు ఎవరి ఖాతా నుంచి ప్రభుత్వ ఖాతాకు తిరిగి వెళ్లాలి?
ట్రాఫిక్ చలాన్ల విషయంలో ప్రజల ఖాతాలపై చూపించే ‘అర్జెన్సీ’, ప్రజాధనం వృథా అయినప్పుడు ఎందుకు కనిపించదు? పాలకులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే వారు పని చేయాల్సింది పోలీస్ ప్రశంసల కోసం కాదు, సామాన్యుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి.
గత రాజకీయ అలవాట్ల నుంచి బయటపడి, ప్రజలకు అండగా నిలిచే పాలనను అందించడమే ఏ ప్రభుత్వానికైనా నిజమైన పరీక్ష. ప్రజలపై ప్రతాపం కాదు, ప్రజల పక్షాన నిలిచే ధైర్యమే రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది. లేకపోతే, ఈ ‘అతిభద్రతా’ ఆలోచనలే పతనానికి నాంది కావచ్చు…!!
Telangana









