ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పదేపదే చెప్పే పోలీసులే… ఆ నియమాలు తమకు పట్టవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు వాడే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ(DGP) పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఇలా డీజీపీ పేరిట ఉన్న పోలీసు వాహనాలపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 17,391 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ చలానాల కింద మొత్తం రూ.68,67,885 చెల్లించాల్సి ఉంది.
హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ మన్ గా పేరుపొందిన లోకేంద్రసింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా, ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. ‘ఇది నిజంగా ప్రజలకు చెడ్డ ఉదాహరణ. నేను ట్రాఫిక్ పోలీసులను చాలా గౌరవిస్తాను. అలాగే చట్టాన్ని అమలు చేసే అధికారుల పారదర్శకత, జవాబుదారీతనం పట్ల నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అభ్యరి్థస్తారని నేను ఆశిస్తున్నాను’అని లోకేంద్రసింగ్ పేర్కొన్నారు.
పోలీసు వాహనాలపై పెద్ద ఎత్తున చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘చలాన్ల చెల్లింపుపై ట్రాఫిక్ వాళ్లు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్లు వీళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తోంది’అని ఒకరు. ‘ఈ వాహనాలను కూడా ప్రయాణం మధ్యలో ఆపి, మిగతా వారందరికీ చేస్తున్నట్లుగా, డబ్బు చెల్లించిన తర్వాతే వాహనాలను ముందుకు అనుమతించాలి’అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఈ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి చెల్లిస్తారు. కానీ, జరిమానాలను ఆ వాహనాలు నడిపిన డ్రైవర్ల నుంచి వసూలు చేయాలి’అని మరొకరు కామెంట్ పెట్టారు.
డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మైనర్లపై కఠిన చర్యలకు హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) ఉపక్రమిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే… వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ను తప్పనిసరి చేయడంతో పాటు… ఏడాది పాటు ఆ వాహనాన్ని సీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంతేకాదు 25 సంవత్సరాలు నిండిన వరకు ఆ మైనర్ కు లైసెన్స్ జారీ చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం భారతదేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వాహనం నడపడం చట్టవిరుద్ధం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు ఏడాది పాటు లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, మైనర్ల డ్రైవింగ్‌ను ప్రోత్సహించకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.