ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ఇకపై చలాన్ నేరుగా వాట్సాప్‌కే రానుంది. డిజిటలైజేషన్‌లో భాగంగా ఏపీ పోలీసులు ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు పోస్టు లేదా ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా మాత్రమే చలాన్ వివరాలు అందుతుండగా, ఇకపై వాహన యజమాని మొబైల్ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ రూపంలో పూర్తి వివరాలు పంపనున్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విభాగంలో మరో ముందడుగు వేసింది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వేదికగా పోలీస్ శాఖకు సంబంధించిన కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్‌ఐఆర్ నమోదు వివరాలు, ఎఫ్‌ఐఆర్ స్థితి, వాహనాలపై విధించిన ట్రాఫిక్ ఈ-చలాన్లను ఇకపై వాట్సాప్ ద్వారానే తెలుసుకునే అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి అన్ని ప్రభుత్వ శాఖల సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు అందించాలన్న దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల సేవలు మన మిత్ర ద్వారా అందుతుండగా, తాజాగా పోలీస్ శాఖ సేవలు కూడా ఈ వేదికలో చేరాయి. దీంతో పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందనున్నాయి.
ఈ సేవలను పొందాలంటే 95523 00009 నంబరును మొబైల్‌లో సేవ్ చేసి, వాట్సాప్‌లో ‘బీఖి’ అని మెసేజ్ పంపాలి. అనంతరం భాషను ఎంచుకుని పోలీస్ శాఖ సేవల విభాగంలోకి వెళ్లవచ్చు. అక్కడ ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్థితి, ఈ-చలాన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేస్తే పెండింగ్‌లో ఉన్న చలాన్ల వివరాలు తక్షణమే లభిస్తాయి. చలాన్లను ఆన్‌లైన్‌లోనే చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ అమలు విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఇకపై చలాన్ నేరుగా వాట్సాప్ ద్వారా పంపే విధానాన్ని ఏపీ పోలీసులు అమల్లోకి తీసుకొస్తున్నారు. డిజిటల్ పోలీసింగ్‌ను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు ట్రాఫిక్ చలాన్లు పోస్టు ద్వారా లేదా ఆన్‌లైన్ పోర్టల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే చాలామందికి సమయానికి సమాచారం అందకపోవడం, చిరునామా సమస్యలు, నకిలీ చలాన్ల భయం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఆధారిత చలాన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు.
ఈ కొత్త విధానంలో ట్రాఫిక్ కెమెరాల ద్వారా నమోదు అయిన ఉల్లంఘనకు సంబంధించిన ఫోటో లేదా వీడియోతో పాటు, ఉల్లంఘన జరిగిన తేదీ, సమయం, ప్రదేశం, విధించిన జరిమానా మొత్తం వివరాలను వాహన యజమాని మొబైల్ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్‌గా పంపిస్తారు. అలాగే చలాన్‌ను వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ప్రత్యేక లింక్ కూడా అందించనున్నారు.
దీంతో వాహనదారులకు స్పష్టత పెరగడమే కాకుండా, చలాన్ చెల్లింపులో పారదర్శకత కూడా మెరుగవుతుంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే చలాన్ చెల్లించే అవకాశం లభిస్తుంది.
ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు వాహనదారులకు కీలక సూచన చేశారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ సరిగా ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. నంబర్ మారినట్లయితే వెంటనే రవాణా శాఖ రికార్డుల్లో అప్డేట్ చేయాలని సూచించారు.
మొత్తానికి, ఈ కొత్త విధానం ద్వారా ట్రాఫిక్ నియమాల అమలు మరింత కఠినంగా మారనుంది. అదే సమయంలో వాహనదారులకు కూడా సౌలభ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రూల్స్ పాటిస్తే చలాన్ భయం లేదు… లేదంటే వాట్సాప్ మెసేజ్ తప్పదు!









