టిడిపి ఆశలకు వైసీపీ గండి కొట్టింది. పల్నాడు జిల్లాకు చెందిన తోట చంద్రయ్య 2022-23 మధ్య రాజకీయంగా చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆయన పాడెను మోశారు. కుటుంబానికి అండగా నిలిచారు. 10 లక్షలు ఆర్థిక సాయం చేశారు. వైసీపీకి సంబంధించిన సానుభూతిపరులే చంద్రయ్యను చంపారు అన్నది చంద్రబాబు అప్పట్లో చేసిన ఆరోపణ. అయితే, ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది.
ఈ క్రమంలో చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు గ్రూప్-2 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎవరికి అభ్యంతరం లేకపోయినా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కల్పించాలన్నది ప్రభుత్వం వ్యూహం. దీనిలో భాగంగా నేరుగా ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ శాశ్వత ఉద్యోగం అని పేర్కొంటూ నేరుగా కనుక ఇస్తే తదుపరి వచ్చే ప్రభుత్వం దానిని రద్దు చేసే అవకాశం ఉంటుంది. గ్రూప్-2 ఉద్యోగాలు అన్నీ కూడా రాజ్యాంగం ప్రాతిపదికన ఏపీపీఎస్సీ నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి చట్టబద్ధత, అదేవిధంగా ప్రభుత్వ భద్రత కూడా ఉంటాయి.
దీంతో ప్రభుత్వం నేరుగా వీరాంజనేయులుకు ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చట్టాన్ని సవరించి ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. కానీ, మండలి లోకి వచ్చేసరికి మాత్రం ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. ఇక్కడే అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. రాజకీయ ప్రేరేపిత కక్షలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం తప్పుకాదు కానీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వడాన్ని వైసిపి సభ్యులు ప్రశ్నించారు.
అయితే భవిష్యత్తులో రాజకీయ కక్షలను అరికట్టాలన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం చేశామని ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ వైసీపీ సభ్యులు ఎదురు దాడి చేశారు. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రంలో హత్యలు జరిగిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుందని, అలా కాకుండా ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చుకోవడం తప్పు కాదని వైసిపి పేర్కొంది. మొత్తంగా దీనిపై దాదాపు రెండున్నర గంటలకు పైగా మండలిలో చర్చ జరిగినప్పటికీ ఈ బిల్లుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు వైసీపీ సభ్యులు దీనిపై ఓటింగ్ కోరుకున్నారు. తద్వారా మండలిలో బలం ఉన్న వైసిపి దీనిని ఓడించాలన్నది ప్రధాన వ్యూహం. ఈ పరిణామాల క్రమంలో సభా సమయం ముగియడంతో ఈ బిల్లును రిజర్వులో పెట్టి సభను నిర్వహికంగా వాయిదా వేశారు. ఇక భవిష్యత్తులో కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అంటే చెప్పడం కష్టం. ఇప్పట్లో అయితే సభ జరగదు కనీసం మూడు నెలలైనా సమయం పడుతుంది. మరి ఈ లోపు తోట చంద్రయ్య కుటుంబానికి టిడిపి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది అనేది కీలక అంశంగా మారింది.
ఎందుకంటే బిల్లు ఆమోదం పొందకుండా గ్రూప్-2 పదవులను ఇచ్చే అవకాశం లేదు. మరి ఇప్పుడు బిల్లు ఏమో మండలంలో ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది చూడాలి. ఒకవేళ గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ తీసుకురావాలని అనుకున్నా.. అది ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా కీలక అంశం. మొత్తానికి ఒక చిన్నపాటి ఉద్యోగం మండలిని రెండున్నర గంటల పాటు కుదిపేయటం చర్చనీయాంశం.