తెలుగుదేశం పార్టీకి ఏపీలో తిరుగులేకుండా రాజకీయం ఉంది. ఎన్నడూ లేనంతగా కన్ఫర్ట్ జోన్ లో ఉంది. విపక్షం పెద్దగా కనిపించడం లేదు, మూడు పార్టీలతో పొత్తు ఉంది. ఇక కేంద్రంలో తమ ఎంపీల బలంతో అధికారంలో ఉన్న ఎన్డీయే ఉంది. దాంతో పాటు రాజకీయంగా అంతా హాయిగానే ఉంది. అయితే తెలంగాణాలో టీడీపీ పుట్టింది. అలా పుట్టిన చోట మాత్రం టీడీపీ పరిస్థితి ఏమిటి అన్న చర్చ ఉండనే ఉంది. గత పదహారు నెలలుగా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ తెలంగాణా మీద ఏ విధంగానూ ఫోకస్ పెట్టడం లేదు.
దాంతో తెలంగాణా టీడీపీ తమ్ముళ్ళు అయితే బాగా తల్లడిల్లుతున్నారు. ఏపీలో అధికారం ఉంది. కేంద్రం దన్నుగా ఉంది. ఈ సమయంలోనే కదా తెలంగాణాలో పార్టీని విస్తరించాల్సింది అని అంటున్నారు. బాబు ఎటూ హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసుకు రావడం లేదు. అంతే కాదు ఆయన ఇంటి వద్ద కూడా నేతలను కలవడం లేదు, ఎంతసేపూ ఏపీ అమరావతి అని ఆయన మొత్తం టైం ఇక్కడే ఇచ్చేస్తున్నారు. దాంతో బాబూ చూడండి మా వైపు అని ఏకంగా తెలంగాణా టీడీపీ నాయకులు అంతా కట్టకట్టుకుని మంగళగిరి పార్టీ ఆఫీసుకే వచ్చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణ తెలుగుదేశం నేతలతో చంద్రబాబు మంగళవారం రాత్రి పొద్దుపోయాక భేటీ అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చర్చించారు. ఒక విధంగా చెప్పాలీ అంటే సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు అనుకోవాలి తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపైన ఈ కీలక సమావేశంలో చర్చించారు అని అంటున్నారు. అదే విధంగా ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది.
తెలంగాణాలో పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా రెండు మూడు రోజుల వ్యవధిలో 638 మండల కమిటీలు, డిజవిన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తి అయిన తరువాత పార్లమెంట్ కమిటీలను నియమించాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఇక తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు చంద్రబాబుకు తెలంగాణా పార్టీ నాయకులు వివరించడం విశేషం. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందించడం ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్ గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని ఈ నాయకులు అంతా బాబుకు తెలిపారు.
మరో వైపు చూస్తే తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు చంద్రబాబు వద్ద ప్రధానంగా ప్రస్తావించారని అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం ఆలస్యం అయ్యేటట్లు అయితే కనుక ఈ లోగానే ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు అయితే అందరి అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని దిశా నిర్దేశం చేశారని అంటున్నారు. అదే సమయంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చే వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని తెలుస్తోంది.
తెలంగాణా టీడీపీ అధ్యక్ష పదవిని దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఇస్తారాని అంటున్నారు. పార్టీ బలోపేతం అయ్యేది నెమ్మదిగా జరుగుతుందని ఈ లోగా ఒక ఇమేజ్ కలిగిన వారికి పదవి ఇస్తే మెల్లగా పార్టీ వైపు ఫోకస్ ఉంటుందని అంటున్నారు. అందుకే నందమూరి వంశీకులకే ఈ పదవి ఇస్తారని అంటున్నారు. తెలుగుదేశానికి తెలంగాణాలో క్యాడర్ కొన్ని జిల్లాలలో ఉంది. నాయకులు అయితే చాలా మంది వెళ్ళిపోయారు. దాంతో పార్టీని చక్కబెట్టి దారికి తెచ్చేలోగా అన్న గారి రక్తానికి అవకాశం ఇస్తే ఒక లుక్ వస్తుందని కొంత మేర చర్చ సాగుతుందని భావిస్తున్నారు. బాబుతో మంగళగిరి మీటింగుకు నందమూరి సుహాసిని కూడా రావడంతో ఆమెకు క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


















