మాటంటే మాటే అన్నది కల్వకుంట్ల వారి ఇంటి ఆడబిడ్డ మాట. ఆమె తండ్రికి తగ్గ వారసురాలు. అందులో రెండవ మాటకు అవకాశం లేదు. ఆమె తనను బీఆర్ఎస్ ని ఎపుడు సస్పెండ్ చేశారో ఆనాడే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కేసీఆర్ కి ఉన్న ఆత్మ గౌరవం తనకూ ఉందని నిరూపించుకున్నారు. ఇపుడు ఆమె తన తోవలో తాను వెళ్తున్నారు.
నిజానికి ఇలా బీఆర్ఎస్ కి రాజీనామా చేయడమేంటి అలా కవిత కొత్త పార్టీ పెడతారు అని ప్రచారం సాగింది. కానీ ఆమె చాలా వ్యూహాత్మకంగానే ఆలోచించారు అనుకోవాలి. అందుకే ఆమె కొంత గ్యాప్ తీసుకుని మరీ జనంలోకి వెళ్తున్నారు. ప్రజలలో ఉన్న అభిప్రాయాలు ఏమిటి వారు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపనకు గల అవకాశాలు ఏ మాత్రం ఉన్నాయి అన్నది కూడా ఆమె ఆలోచిస్తున్నారు. అంతే కాదు రాజకీయ శూన్యత ఏ మేరకు ఉందని అంచనా వేసేందుకే ఆమె రాష్ట్ర స్థాయి యాత్రకు శ్రీకారం చుట్టారు.
అయితే ఇక్కడే ఆమె బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన తండ్రి కేసీఆర్ చిత్ర పటం వద్దు అని ఆమె చెప్పారు. ఆయన తెలంగాణా ఉద్యమ నాయకుడిగా ఉన్నారని ఆయన అంటే గౌరవం అన్నారు. అంతే కాదు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఆయన కడుపున పుట్టడం అని కూడా అన్నారు. కానీ ఆయన బీఆర్ఎస్ అని ఒక పార్టీకి నాయకుడు కాబట్టి ఆయన ఫోటోని తాను వాడడం లేదని అన్నారు. నైతికంగా ఇది మంచిది కాదని కూడా చాలా చక్కగా చెప్పారని అంటున్నారు.
అయితే కవిత ఇలా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగానే అలా ఆమె మీద విమర్శలు చేశారు కొంతమంది బీఆర్ ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వారు ఆనాడే కవిత తన ఇంటిపేరుని కల్వకుంట్ల అని వాడకూడదని అత్తింటి వారి పేరే వాడాలని కూడా సూచించారు. అయితే దాని మీద ఎవరి వాదనలు వారికి ఉన్నాయని చెబుతారు. కానీ ఇపుడు కవిత తన తండ్రి ఫోటో వాడను నైతికతకు సంబంధించిన విషయం అని చెబుతున్న వేళ మరోసారి ఆమె ఇంటి పేరు చర్చకు వస్తోంది. కల్వకుంట్ల అన్న ఇంటి పేరుతో ఆమె జనంలోకి వెళ్తారా లేక జాగృతి కవిత అన్న పేరుతో వెళ్తారా అన్న చర్చ అయితే వస్తోంది.
అయితే ఇంటి పేరు వాడితే తప్పేంటి అన్న వారు కవిత అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కుమార్తె కదా. అలా ఆమె ఇంటి పేరు ఎప్పటికీ ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడే రాజకీయంగా చర్చ ఉంది. గతంలో ఏపీలో కూడా వైఎస్ ఇంటి పేరుని షర్మిల వాడకూడదు అని వైసీపీ వారు నానా యాగీ చేశారు. ఇపుడు అలాగే కల్వకుంట్ల అని వాడితే ఆయన రాజకీయ వారసత్వానికి కూడా ఆమె పోటీ అవుతారు కదా అన్న వారూ ఉన్నారు. అయితే ఇంటి పేర్లు కానీ కేసీఆర్ ఫోటోలు కానీ ఇవేమీ కాదు, జనాలు కవిత నాయకత్వ సామర్థ్యం గుర్తిస్తే కనుక ఎవరు కాదన్నా ఆమెకు కీలక స్థానమే తెలంగాణా రాజకీయాల్లో ఉంటుంది అని అంటున్నారు. అలా కాదు అనుకుంటే ఎంతో మంది రాజకీయ వారసులుగా వచ్చి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా అని ఉదహరిస్తున్నారు.