తెలంగాణలో బీజేపీ ఒక పొలిటికల్ స్టాండ్ అయితే తీసుకుంది అని అంటున్నారు. ఎన్నిక ఏదైతే కానీ. తాము ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ధారించుకుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సింగిల్ గా పోటీ చేస్తే ఎదగవచ్చు అన్నది ఆ పార్టీ భారీ వ్యూహంగా ఉంది. గత పదేళ్ళుగా బీజేపీ రాజకీయ విధానం ఈ విధంగానే ఉంది. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అదే తీరున ముందుకు సాగుతోంది అని అంటున్నారు.
తెలంగాణాలో ప్రస్తుతం చూస్తే రాజకీయం మూడు ముక్కలుగా ఉంది. అధికార కాంగ్రెస్ ఒక వైపు బీఆర్ఎస్ మరో వైపు బీజేపీ ఇంకో వైపు ఉన్నాయి. అయితే చిత్రమేంటి అంటే రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ ఎస్ ఉంది. జాతీయ పార్టీతో పోరాడే శక్తి మరో జాతీయ పార్టీకే ఉంటుందని బీజేపీ 2024 ఎన్నికల్లో జనాలకు చెప్పగలిగింది. ఫలితంగా కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా దక్కలేదు అంతకు ముందు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాతిక సీట్లు వస్తాయనుకుని బరిలోకి దిగితే ఎనిమిది మాత్రమే వచ్చాయి. అయితే చాలా చోట్ల రెండవ మూడవ స్థానంలో బాగానే ఓట్లు సంపాదించి కమలం పార్టీ బాగానే రాణించింది.
ఇక 2014లో చూస్తే ఉమ్మడి ఏపీగానే ఉండగా సార్వత్రిక ఎన్నికలు జమిలిగా సాగాయి. అయితే ఆనాడు బీజేపీ మంచి సీట్లనే టీడీపీతో పొత్తుతో సాధించింది. కానీ ఆ తరువాత మాత్రం తెలంగాణాలో రాజకీయం మారింది. టీడీపీని ఆంధ్రా పార్టీగా ముద్ర వేసి బీఆర్ఎస్ గురి పెట్టింది. దాంతో 2018 నాటికల్లా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే దక్కింది. కానీ ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు సాధించి తన బలాన్ని పెంచుకుంది అంతే కాదు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటింది. ఇవన్నీ కూడా 2023, 2024 ఎన్నికల్లో ప్రతిఫలించి కమలానికి కొత్త వెలుగులు అందించాయి.
ఇక ఏపీలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి. అధికారంలోకి వచ్చాయి. ఏపీలో బీజేపీ గ్రాఫ్ అయితే ఎక్కడా పెరగడం లేదు. పొత్తు ఉంటేనే గెలుస్తోంది. లేకపోతే డిపాజిట్లు కూడా రావడం లేదు. దాంతో బీజేపీ ఏపీ వరకూ పొత్తుల బాటనే ఎంచుకుంది. కానీ తెలంగాణాలో మాత్రం తన రూటే సెపరేటు అంటోంది. పైగా కూటమి పొత్తులను తెలంగాణాలో కూడా కొనసాగనిస్తే అది బీఆర్ఎస్ కి రాజకీయంగా అడ్వాంటేజ్ ఇచ్చినట్లే అని లెక్క వేస్తోంది. అందుకే నో దోస్తీ అని ఎన్డీయే మిత్రులకు చెప్పేస్తోంది.
ఇక తాజాగా ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీ హిల్స్ లో ఒంటరిగా పోటీకి బీజేపీ రెడీ అయింది అని అంటున్నారు. ఇక్కడ చూస్తే సహజంగానే టీడీపీకి కొంత బలం ఉంది. సామాజిక సమీకరణ దృష్ట్యా చూసుకున్నా టీడీపీతో పొత్తు అంటూ వెళ్తే ఉపకరిస్తుంది. కానీ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా బీజేపీ వద్దు అనుకుంటోంది. ఒంటరిగా వెళ్లి సత్తా చాటితేనే జనాలు గుర్తిస్తారని కాంగ్రెస్ కి తామే ఆల్టర్నేషన్ గా ఉంటామన్న సందేశాన్ని చేరవేస్తే కనుక 2028లో అధికారం దక్కుతుందని భావిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని బీజేపీ చూస్తోంది కానీ పార్టీలతో పొత్తుకు మాత్రం నో అంటోంది. మరి కమలం పార్టీది ధీమానా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ నా అన్నది చూడాల్సి ఉంది.