2023 చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటకు రాలేకపోతోంది? ఇప్పటికి తమ ఓటమికి కారణాల్ని వెతుకుతోంది. ఇందుకు తాజాగా ఆ పార్టీ కీలక నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటికి పార్టీ ఓటమికి కారణం పార్టీ అధినేత కేసీఆర్ కానే కాదని.. ఆ తప్పు ఎలా జరిగిందో తెలుసా? అంటూ కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తున్న వైనం చూస్తే.. ఇప్పుడు ఇది అవసరమా? అనిపించకమానదు.
జరిగింది వదిలేసి.. జరగబోయే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఓటమి ఎదురైన ఆర్నెల్ల వరకు ఇలాంటివి చెప్పేందుకు.. వినేందుకు బాగుంటాయి. ఓటమి ఎదురై మరో రెండు నెలలకు రెండేళ్లు పూర్తి కావొస్తున్న వేళలోనూ.. ఇంకా అప్పటి ఓటమి దగ్గరే కేటీఆర్ ఆగినట్లుగా కనిపిస్తోంది. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? అంటూ కేటీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకూ ఆయన ఎమన్నారంటే..?
‘‘ఎన్నికల వేళలో తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడినా ఫర్లేదు.. కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అవుతారని భావించారు.అందరూ అలా అనుకోవటం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారు’’ అని మండిపడ్డారు. ఒకవేళ కేటీఆర్ చేసిన వాదనే సరైందని భావిద్దాం. ప్రజల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను గుర్తించటంలో ఫెయిల్ అయ్యింది ఎవరు? తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చి ఉంటే.. ఈ ఓటమి ఎదురయ్యేది కాదు కదా? అలా చూసినా.. కేసీఆర్ అంచనాలు తప్పటంలోనే ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు కదా?
అలాంటప్పుడు ఓటమి నిందను వాళ్ల మీదా.. వీళ్ల మీదా వేసే బదులుగా ఆ విషయాన్ని వదిలేసి.. ప్రజా సమస్యల మీద ఫోకస్ ఎక్కువగా పెడితే బాగుంటుంది కదా? అన్నది ప్రశ్న. ఇప్పటికి తమలోని లోపాల్ని అంగీకరించే బదులుగా.. ఎదుటోళ్లను బద్నాం చేసే ధోరణి నుంచి కేటీఆర్ బయటకు రానంత వరకు ఆ పార్టీకి మేలు జరగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకోవటం ఒక్కటే బీజేపీకి తెలుసన్న కేటీఆర్.. కాంగ్రెస్ దొంగ మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదని.. కానీ ఊళ్లలో నమ్మి మోసపోయారని కేటీఆర్ వ్యాఖ్యానించటం గమనార్హం. ఒకవేళ ఆ మాటే నిజమని భావిస్తే.. హైదరాబాద్ మహానగర పరిధిలో గెలిచిన కంటోన్మెంట్ స్థానం.. సదరు ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించిన వేళ.. సార్వత్రిక ఎన్నిక వేళలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడింది? కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు గెలిచినట్లు? అన్నవి ప్రశ్నలు.
అంటే.. తమను గెలిపించిన కంటోన్మెంట్ ప్రజలు.. ఆర్నెల్లకే కాంగ్రెస్ దొంగ మాటలకు పడిపోయి.. ఓటేసినట్లా? మరి..ఇలాంటి ప్రశ్నలకు కేటీఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారు? తమ ఓటమికి తాము ఎంత మాత్రం కారణం కాదన్నట్లుగా.. అయితే ప్రజలు మోసపోయారు, లేదంటే.. పార్టీలుమోసం చేశాయన్న మాటలు కేటీఆర్ ఇంకెంత కాలం చెబుతారు? అన్నది ప్రశ్న. అందుకే అనేది.. ప్రత్యర్థులపై నిందలు వేయటం మానేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే అంశం మీద మరింత ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు. మరి..ఇలాంటి అంశాల మీద కేటీఆర్ ఫోకస్ పెట్టేదెప్పుడు? అన్నదే అసలు ప్రశ్న.!