”చెప్పకనే చెప్పారు.. ఇక, తర్జన భర్జనకు తావులేదు.. దారి మళ్లాల్సిందే.” బీఆర్ ఎస్‌లో నెలకొన్న పరిణా మాలపై తాజాగా ఆ పార్టీ కీలక నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పైకి ఆయన కవిత పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె-ఆమె అంటూ.. చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా కవిత గురించేన న్నది సుస్పష్టం. ఈయన మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహారం హాట్ హాట్‌గానే సాగు తోంది. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తను ఇష్టపడితే.. ఎంతటి వారినైనా.. స్థాయీ బేధాలు లేకుండా.. ఇంటికి వెళ్లి మరీ పలకరిస్తారు.
ఇక, తనతో తేడా వస్తోందని గమనిస్తే.. ఎంతటి వారినైనా పక్కన పెడితారు. అయితే.. ఇష్టానికి, అయిష్టానికి మధ్య ఉన్న తేడాను ఆయన నేరుగా ఎవరికీ చెప్పరు. గతంలో తుమ్మల నాగేశ్వరావు, కోదండరామిరెడ్డి వంటి కీలక నాయకుల విషయంలో కేసీఆర్ ఇలానే చేశారు. వారిపై ప్రేమ ఉన్నంత వరకు నెత్తిన పెట్టు కున్నారు. తేడా వచ్చాక.. పక్కన పెట్టారు. అయితే.. ఈ విషయాన్ని ఆయన నేరుగా చెప్పరు. వారంతట వారే తెలుసుకోవాలి. ఇది తెలుసుకునే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది.
అలానే ఇప్పుడు కేసీఆర్ తన బిడ్డ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. డియర్ డాడీ లేఖ తర్వాత.. కేసీఆర్ కవితతో విభేదిస్తున్నారు. ఆమె లేఖ రాసినందుకు కాదు. ఆ లేఖలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను బహిరంగం చేయడం, ముఖ్యంగా `పార్టీ విలీనం` అంశాన్ని నడిరోడ్డుకు లాగడం వంటివాటిని కేసీఆర్ సహించడం లేదన్నది పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. దీనికి తోడు.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ.. కవిత చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్‌కు నచ్చలేదు.
ఈ క్రమంలోనే ఆమెను ఇక, దూరం పెట్టేశారు. దాదాపు మూడు మాసాలుగా కవిత పేరును పార్టీ నాయకు లు ఎవరూ కూడా స్మరించడమే లేదు. అయినా.. కవిత పార్టీలోనే ఉన్నానని చెబుతూ.. ఆ పార్టీ జెండా లేకుండానే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక, తాజాగా తెలంగాణ బొగ్గు గనికార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవిని ఆమె నుంచి తీసేశారు. దీంతో కేసీఆర్ తన సంకేతాలను స్పష్టంగా ఇచ్చారన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. దీనిని ఇక, యాగీ చేయడం వల్ల కవిత నష్టపోతారే తప్ప.. బీఆర్ ఎస్‌కు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన దారి తాను చూసుకోవచ్చన్నది పరిశీలకులు చెబుతున్న మాట.