ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ, ఇదేమి మాటలు? ఇదేమి వైఖరి?
“పైసలు లేవు… నన్ను కోసుకొని తింటారా? నన్ను కూర వండుకుంటారా? ఏ పథకం ఆపమంటారు? మీకు జీతాలు పెంచమంటే ఉన్నది కూడా కూలిపోతుంది!” ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు.
అయ్యా ముఖ్యమంత్రీ గారూ, ఇదేమి వ్యాఖ్య? రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న నీవు ఇలాంటి నిరాశాజనక, నిస్సహాయ స్వరంతో మాట్లాడితే జనం ఏం ఆలోచిస్తారు? ఇవి పాలకుని మాటలా, లేక అలసిపోయిన ఎద్దు బాధామయ స్వరమా? “కాడి ఎత్తేసే ఎద్దు మాటలు, కులవడ్డ ఎద్దు చేష్టలు” అన్నట్టు, ఈ తీరు ఎందుకు? రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దిశానిర్దేశం చేయాల్సిన నీవు, ఇలాంటి నిస్పృహతో కూడిన వ్యాఖ్యలతో ఉద్యోగుల ఆశలను ఆవిరి చేస్తావా?
మీరు కొత్తగా ఒక ఆర్థిక వేత్తను చీఫ్ సెక్రటరీగా నియమించారు కదా? ఆయన అనుభవాన్ని, నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతైనా, కేసీఆర్ జమానా నుంచి రాష్ట్ర ఆర్థిక రథాన్ని నడిపిన వ్యక్తి ఆయన. మీరిద్దరూ కలిసి, ఇతర విషయాలను పక్కన పెట్టి, రాష్ట్ర ఉద్యోగుల గోడును ఆలకించండి. వారి జీతభత్యాల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఒక సమర్థవంతమైన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించండి.
ముఖ్యమంత్రి గారూ, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి. ఆర్థిక శాఖ నిపుణులతో సమావేశాలు నిర్వహించండి, ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆలోచనలు సేకరించండి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపండి. ఉద్యోగుల ఆందోళనలను విస్మరించకండి, వారి నమ్మకాన్ని చూరగొనండి. నీవు చూపే దీక్ష, దిశానిర్దేశమే తెలంగాణను మళ్లీ సుభిక్ష పథంలో నడిపిస్తుంది.
ఇది సమయం వ్యాఖ్యలు చేసేందుకు కాదు, సమస్యలను పరిష్కరించేందుకు. ఆ దిశగా అడుగు వేయండి, ముఖ్యమంత్రి గారూ!