కొన్నిసార్లు అంతే. పెద్దగా అంచనాలు లేనోళ్లు అత్యున్నత స్థానాలకు చేరితే వారి తీరు వేరుగా ఉంటుంది. అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మరో ఉదాహరణగా మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి.. పెరిగి.. తమను తాము నిరూపించుకున్న ఎంతో మంది ఉన్నప్పటికి వారికి దక్కని ముఖ్యమంత్రి పోస్టు పార్టీలో చేరిన అతి తక్కువ వ్యవధిలోనే సొంతం చేసుకోవటం రేవంత్ సమర్థతకు.. సామర్థ్యానికి ఒక నిదర్శనంగా చెప్పాలి. సీఎంగా పదవిని చేపట్టిన కొద్దిరోజుల పాటు ఆయనకు ఎదురైన చికాకులు.. చిక్కులు అన్ని ఇన్ని కావు. ముఖ్మయంత్రి పదవిలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఆయన.. ఇంకా పాలన మీద పట్టు రాలేదనే చెప్పాలి.
అయితే..వ్యక్తిగతంగా మాత్రం ఆయన తన సత్తా చాటుతున్నారు. వ్యవస్థగా చేయలేని ఎన్నో పనుల్ని ఆయన వ్యక్తిగా చేస్తున్నారు. తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకోవటమే కాదు.. తెలుగు రాష్ట్రాలకు సరికొత్త అనుభూతిని సీఎంగా పరిచయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నోళ్లు ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా వ్యవహరించటం.. అంతకు ముందు వరకు తాము సాదాసీదా అన్న విషయాన్ని వదిలేసి.. పదవిలో ఉన్న రోజులు ఎవరికి అందుబాటులోకి రాకుండా.. రాజరికాన్ని గుర్తుకు తెచ్చేలా వ్యవహరించే ధోరణి గడిచిన కొన్నేళ్లుగా చూస్తున్నదే.
అలాంటి తీరుకు సీఎం రేవంత్ చెక్ పెట్టారనే చెప్పాలి. ఏ మాత్రం అవకాశం లభించినా.. దాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్న రేవంత్.. తనను తాను సాదాసీదా సీఎంగా ప్రజల మనసుల్లో గుర్తుండిపోయేలా చేసేందుకు శ్రమిస్తున్నారు. రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగుల్ని జాగ్రత్తగా గమనిస్తే.. మొదట్లో ఆయన పదవిని చేపట్టిన సమయంలో వ్యవహరించిన కొందరు నేతల తీరులో మార్పు రావటమే కాదు.. మన పని మనం చూసుకుందాం.. సీఎంను డిస్ట్రబ్ చేయటం ద్వారా తమకే నష్టమన్న విషయాన్ని వారు గుర్తిస్తున్నారు.
దీంతో.. ఆయనకు కొన్ని చికాకులు తగ్గాయి. అదే సమయంలో సీనియర్ నేతలకు.. మంత్రులకు అవసరమైన స్వేచ్ఛను ఇస్తున్నారు. వారి విలాసవంతమైన వైఖరిని ప్రశ్నించకుండా.. అదే సమయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమాన్ని హెలికాఫ్టర్ లో చూడటం సాధారణంగా ముఖ్యమంత్రి చేస్తారు.
కానీ.. తాజాగా చూస్తే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ పని చేశారు. పోలీస్ బాస్ తో పాటు.. హైదరాబాద్ సీపీ.. జిల్లా కలెక్టర్.. జీహెచ్ ఎసీ కమిషనర్ ఇలా పలువురు అధికారుల్ని వెంట పెట్టుకొని ఏరియల్ రివ్యూ చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం సింఫుల్ గా మూడంటే మూడు కార్లలో తెలంగాణ సచివాలయం వద్ద భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
అంతేకాదు.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. ముఖ్యమంత్రిగా సహజంగా ఉండే గ్రీన్ చానల్ ను వాడుకోకుండా.. అత్యంత తక్కువ కాన్వాయ్ తో ఎలాంటి హడావుడి లేకుండా నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన ఆయన.. పిల్లలకు షేక్ హ్యాండ్ ఇవ్వటం.. యూత్ తో ఫోటోలు దిగటం ద్వారా తనను తాను ఇస్పెషల్ సీఎం అన్న విషయాన్ని చేతలతో చూపిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి నిమజ్జన వేళ స్వయంగా రావటం గడిచిన నలభై ఐదేళ్ల వ్యవధిలో ఇదే తొలిసారి అని భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి వారు ప్రకటించటం చూస్తే.. సీఎం రేవంత్ రికార్డుల మీద ఎంతలా గురి పెట్టారో అర్థమవుతుంది.
అంతేనా.. సరిగ్గా నెల క్రితం ఆగస్టు నెలలో ఒక ఆదివారం సాయంత్రం చెప్పా పెట్టకుండా అమీర్ పేట పరిధిలోని ముంపు ప్రాంతాల్ని పరిశీలించి.. బాధితులకు అందాల్సిన సాయంతో పాటు.. ముంపు నివారణకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని చర్చించిన సంగతి తెలిసిందే. నిత్యం హైదరాబాద్ మహానగరంలో ఉండే ముఖ్యమంత్రులు.. నగరంలో ఏదైనా సమస్య ఏర్పడితే వెళ్లి చూసి రావటం లాంటివి పెద్దగా ఉండేవి కావు.
ఆ తీరుకు సీఎం రేవంత్ చెక్ పెట్టారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి కార్యాలయానికి.. అధికార నివాసానికి దగ్గరగా ఉండే అమీర్ పేటకు ఒక ముఖ్యమంత్రి వెళ్లి.. ఆ ప్రాంతంలో తిరగటం దశాబ్దాల ముందు జరిగినట్లుగా చెప్పటం చూస్తే.. రేవంత్ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా ఉంటున్నాయని చెప్పొచ్చు. సాదాసీదాగా వ్యవహరించే ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఇష్టపడతారు. ప్రజల మనసుల్ని దోచుకునే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ మంచి మార్కులే కొట్టేస్తున్నారని చెప్పక తప్పదు.