తెలంగాణ లో ఈనెల 18న(శనివారం-రేపు) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను నిర్వహించాలని బీసీ జేఏసీ నాయకులు నిర్ణయించారు. ఈ బంద్ లక్ష్యం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఒత్తిడి చేయడమే. అయితే, ఎవరి కోసం అయితే ఈ బంద్‌ను నిర్వహిస్తున్నారనే స్పష్టత ఉన్నప్పటికీ ఎవరిమీద ఈ యుద్ధం ప్రకటించారు? అన్నది మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ఈ బంద్‌కు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ అదేవిధంగా ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.
బిజెపి కూడా తమది బీసీ పార్టీ అని, బీసీలకు మద్దతిస్తామని ఇటీవల ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దీనికి స్పష్టత ఇచ్చారు. అంటే ఒక రకంగా మొత్తం అన్ని పార్టీలు బీసీలకు మద్దతు ప్రకటించాయి. బీసీల బంద్‌కు కూడా సహకరిస్తామని చెప్పాయి. ఇంక అలాంటప్పుడు ఎవరి మీద ఈ యుద్ధం జరుగుతోంది? ఎవరి మీ మీద ఈ బంద్ ప్రయోగిస్తున్నారు? అన్నది లాజిక్?!. నిజంగా ఎవరైనా వ్యతిరేకిస్తే లేదా అధికారంలో ఉన్న పార్టీ అనుకూలంగా లేకపోతే ఇలాంటి నిరసనలు చేపట్టడం తప్పు కాదు.
కానీ, ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెబుతున్నాయి. అలాంటప్పుడు బంద్ ఎవరి మీద చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? అనేది ఇప్పుడు సమస్య. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలి అనుకుంటే అది రాష్ట్రంలో అవసరం లేదు. ఢిల్లీలో చేస్తే ఉత్తమమని విశ్లేషకులు చెప్తున్నారు. లేదు అలా కాకుండా ప్రస్తుతం ఉన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాయ ప్రక్రియ నుంచి ఎదురవుతున్నవే. అలాగే రాజ్యాంగం పరంగా ఎదురవుతున్న సమస్యలే.
అటువంటప్పుడు వీటి మీద నిరసన వ్యక్తం చేయటం అంటే అది ఒక రకంగా కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది అన్నది విశ్లేషకుల మాట. ఇటు హైకోర్టులో కానీ అటు సుప్రీంకోర్టులో కానీ ఇప్పటివరకు రిజర్వేషన్ల విషయంపై సానుకూలత వ్యక్తం కాలేదు. హైకోర్టు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయలేదు. పైగా హైకోర్టు లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అంటే ఒక రకంగా ఇది న్యాయ ప్రక్రియ ముందు నిలబడిన సమస్య. అటువంటప్పుడు ఎవరి మీద ఎవరు బంద్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు చేసింది. అనంతరం గవర్నర్కు పంపించింది. అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదించాలని సీఎం ఢిల్లీ వెళ్లి నిరసన కూడా వ్యక్తం చేసి వచ్చారు. అయినప్పటికీ ఎటువంటి ఆమోదం లభించలేదు. దీంతో గతంలో తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని సదరు బిల్లు ఆమోదం పొందినట్టుగా భావిస్తూ జీవోను జారీ చేశారు. ఇది చెల్లుబాటు కాదన్నది హైకోర్టు స్పష్టం చేసిన మాట. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండి ఆమోదం పొందకపోతే మాండమస్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అలా కాకుండా స్వతంత్రంగా జీవో ఎలా జారీ చేస్తారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మొత్తంగా ఈ వ్యవహారంలో న్యాయ ప్రక్రియ దగ్గరే ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నది స్పష్టమవుతుంది. రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా రాజ్యాంగబద్ధమైన సమస్యలు అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రస్తుత రిజర్వేషన్ కు ఇబ్బందులుగా మారాయి. కాబట్టి ఇది రాజకీయపరమైన అంశం కాదన్నది స్పష్టమవుతోంది. అలాంటప్పుడు తెలంగాణ బందుకు పిలుపునిచ్చి అన్ని పార్టీలు సహకరించి ఏం సాధించేటట్టు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప.. బంద్ చేశామన్న పేరుతో ప్రజలను ఆకట్టుకునే విధానం తప్ప మరో విషయం లేదన్నది స్పష్టమవుతోంది. అటువంటప్పుడు ఈ బంద్‌కు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఏదేమైనా బంద్ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలు కూడా కనిపించడం లేదు. పోనీ, ఈ బంద్‌వల్ల ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ వచ్చేస్తుందా? అంటే అది కూడా సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు బందు చేసి ప్రయోజనం ఏంటి అన్నది సాధారణ ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. దీనిని జేఏసీ ఏం చెబుతుందో చూడాలి.