పురుషులతో పోలిస్తే మహిళలకు గుండెపోట్ల ఘటనలు తక్కువగా వినిపిస్తుంటాయి. అయితే.. అందుకు భిన్నంగా ఈసారి బతుకమ్మ వేడుకల సందర్భంగా హైదరాబాద్.. హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న విషాద ఉదంతాలు షాకింగ్ గా మారాయి. ఆదిభట్లలో ఒక మహిళ ఇటీవల రాత్రి వేళ బతుకమ్మాడటం.. ఆయాసంగా ఉందని గదిలోకి వెళ్లి పడుకున్న కాసేపటికి తనువు చాలిచారు.
అంతేకాదు.. సంగారెడ్డికి చెందిన 24 ఏళ్ల యువతి కూడా బతుకమ్మ ఆడుతూ ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మరణించారు. ఈ ఉదంతాలు షాక్ కు గురి చేస్తున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోట్లు తక్కువగా ఉంటాయి. దీనికి కారణంగామహిళల్లోని ఈస్టోజన్ హార్మోన్ వారికి సహజ రక్షణగా నిలుస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. మంచి కొవ్వును డెవలప్ చేయటమే కాదు.. గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
ఇందుకు భిన్నంగా ఇటీవల కాలంలో మహిళల్లోనూ గుండెపోట్ల బారిన పడటం చూస్తే.. జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు కూడా కారణాలుగా చెప్పొచ్చు. ఇలాంటి వేళ..ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ముప్పును నివారించొచ్చన్న మాట వినిపిస్తోంది. దీర్ఘకాలంగా షుగర్ సమస్య ఉండటం.. అధిక బరువు.. అధిక కొలెస్ట్రాల్.. అధిక రక్తపోటు.. ఒత్తిడి.. స్మోకింగ్.. రుతుక్రమం ఆగేందుకు గర్భ నిరోధక మాత్రలు వాడటం లాంటివి కారణాలుగా చెప్పాలి. దీనికి తోడు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇంతకు ఛాతీనొప్పికి సంబంధించిన ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశంలోకి వెళితే.. ఛాతీలో నొప్పి.. అసౌకర్యంగా ఉండటం.. రెండు చేతులూ గుంజటం.. మెడ.. దవడ..వీపు.. పొత్తికడుపు వరకు నొప్పి..ఊపిరి తీసుకోవటంలో అసౌకర్యం.. ఆలసట.. వికారం.. వాంతులు.. తల తిరగటం.. చెమటలు పట్టటం లాంటివి ఎదురైతే వెంటనే వైద్యుడ్ని సంప్రదించటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.