తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపకుండా హైకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ నేతలు కేసీఆర్, హరీష్ రావుకు చుక్కెదురైంది. నిన్న వీరిద్దరూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇచ్చేందుకూ నిరాకరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ దీనిపై ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత సీబీఐ దర్యాప్తు జరపకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై అత్యవసర విచారణ కోరినా హైకోర్టు అంగీకరించలేదు.
ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు… సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించింది. అంతే కాదు రేపటి లోగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్ చేసిన విజ్ఞప్తినీ తోసిపుచ్చింది. దీంతో సీబీఐ దర్యాప్తుపై కానీ, వీరిద్దరి అరెస్టు జరగకుండా కానీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని అరెస్టు చేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు రేపు కూడా ఈ పిటిషన్లపై అత్యవసర విచారణ కాకుండా సాధారణ విచారణ అంటే రేపు ఉదయం 10.30 గంటలకు మరోసారి విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.
నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఏం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడిన రేవంత్.. కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారన్నారు. దీంతో బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు కూలిందన్నారు. ఇందుకు కేసీఆర్, హరీష్, ఈటెల సహా అధికారులంతా బాధ్యులేనన్నారు. కేసీఆర్ దోపిడీ దొంగగా మారి లక్ష కోట్ల తెలంగాణ సొత్తు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి ఫాంహౌస్, మీడియా సంస్ధలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. అనంతరం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తుకు నిర్ణయించినట్లు తెలిపారు.