తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు హరీష్ రావుల మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఘోష్ నివేదికలోని 98పేజీలో ఉన్న వివరాలను చదువుతూ.. “నాటి నీటి పారుదల శాఖ మంత్రి(హరీష్‌రావు) వ్యవస్థలను తప్పుదారి పట్టించారు.“ అని నివేదికలో స్పష్టంగా ఉంది. తీసి చదువుకోరాదా!“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రంలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కేసీఆర్ సర్కారుకు రాసిన లేఖ విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు.
”ఉమాభారతి ఓ లేఖ రాశారు. దీనిలో స్పష్టంగా ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను కట్టుకోవాలని.. వాటిని పూర్తి చేయాలని సూచించారు. అంతేకాదు.. కావాల్సినంత నీరు సమృద్ధిగా ఉందని కూడా చెప్పారు. కానీ, కేసీఆర్, హరీష్‌రావులు దీనిని పక్కన పెట్టా రు. కావాలంటే.. చూడండి.. ఈ లేఖ” అంటూ.. నాడు ఉమాభారతి రాసిన లేఖలోని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చదవి వినిపిం చారు. అంతేకాదు.. నిజాం కన్నా ధనవంతుడు కావాలన్న దుగ్ధతోనే కేసీఆర్.. తెలంగాణ సమాజాన్ని దోచుకునేందుకు నీరు సమృద్ధిగా ఉందని చెప్పినా.. నాటి ఉమాభారతి లేఖను పక్కన పెట్టి దీనికి పూనుకొన్నారు.. అనిసీఎం నిప్పులు చెరిగారు.
అయితే.. ఈ సందర్భంగా హరీష్‌రావు జోక్యం చేసుకుని..ఉమాభారతి ఇచ్చిన లేఖలో కేవలం తొలి పేజీ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చదవివినిపించారని.. కానీ, మూడో పేజీలో ఏముందో కూడా ఆయన చదివి వినిపించాలని పట్టుబట్టారు. కానీ, ప్రసాదరావు మాత్రం మైక్ కట్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పీసీ ఘోష్ రిపోర్టులో అన్నీ నిజాలే ఉన్నాయని.. ఈ విషయం తెలుసుకాబట్టే.. హరీష్‌రావు పదే పదే చర్చను పక్కదారి పట్టించేలా చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి విచారణ కోరుకుంటే.. అలాంటి విచారణకే ప్రభుత్వం ఆదేశిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే.. అసలు నివేదికకే పవిత్రత(శాంటిటీ) లేకపోతే.. ఇక, విచారణ ఎక్కడిది? అని హరీష్‌రావు మళ్లీ ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకి చంద్ర ఘోష్ ఇచ్చిన నివేదికపై చర్చజోరుగా సాగింది. తొలుత ఈ చర్చను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం.. బీఆర్ ఎస్ తరఫున నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు మైకు అందుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా ఆయనకు, స్పీకర్ ప్రసాదరావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 660 పేజీల నివేదికపై మాట్లాడేందుకుతనకు కనీసంలో కనీసం 2 గంటల సమయం అయినా ఇవ్వాలని ప్రసాదరావును కోరారు. అయితే.. సభలో ఎక్కువ మంది మాట్లాడాల్సిన అవసరం ఉందని స్పీకర్ అన్నారు.
ఈ నేపథ్యంలో కీలకమైన సబ్జెక్టు కాబట్టి.. అరగంట వరకు సమయం ఇస్తామని చెప్పారు. దీనిపై హరీష్‌రావు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 600 పేజీల నివేదికపై అరగంట సమయం అంటే ఎలా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్ మాత్రం “ఇప్పటికే సమయం ప్రారంభమైందని.. వృథా చేసుకోవద్దని“ సూచించారు. దీంతో హరీష్‌రావు.. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. కేసీఆర్‌పై ఉన్న రాజకీయ దుగ్ధతోనే కాళేశ్వరంపై విచారణ చేయించారని.. అసలు దీనికి ఏ నిబద్ధతా లేదని అన్నారు. కాళేశ్వరంలో అసలు ఏం జరిగిందో.. వాస్తవాలు తెలియాలంటే..తమకు సభలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చే సౌకర్యంకల్పించాలని కోరామన్నారు. కానీ, దీనికి ప్రభుత్వం అడ్డుపడిందన్నారు.
అప్పుడే ఈ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అర్ధమైపోతోందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తమపై ఇష్టానుసా రంగా వ్యాఖ్యలు చేయడం, నిందలు మోపడం సరికాదన్నారు. విశాల తెలంగాణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని.. అనేక రాష్ట్రాల చుట్టూ తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని వివరించారు. కమిషన్ నివేదికపై మరో రెండు రోజులు సమయం ఇచ్చినా మాట్లాడేందుకు సరిపోదన్నారు. ఇక, ఆదివారం అయినప్పటికీ.. సభలో ఈ రిపోర్టును ప్రవేశ పెట్టడంపైనా హరీష్‌రావు మండిపడ్డారు.
తాము కోర్టుకు వెళ్లామని.. సోమవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని.. అందుకే ప్రభుత్వం ఆదివారమే అయినా.. ముఖ్యమంత్రికి తీరిక లేకపోయినా(మధ్యలో ఆయన కేరళకు వెళ్లి వచ్చారు).. సభలో ప్రవేశ పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానిం చారు. గతంలోనూ అనేక కమిషన్ రిపోర్టులపై కాంగ్రెస్ కీలక నాయకులే కోర్టులకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. “కాళేశ్వరంపై కమిషన్ కట్టుకథ. ఇదో డ్రామా. నిజంగానే ఈ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగి ఉంటే.. నిజాలు బయటకు వచ్చేవి. కానీ, ఇది రాజకీయ ప్రోద్బలంతో కేసీఆర్‌పై కక్షతో జరిగింది. ఇది నివేదికకాదు. నిష్పక్ష పాతంగా జరగని నివేదిక ఏదైనా.. చిత్తు కాయితం. ఈ మాట సుప్రీంకోర్టే చెప్పింది.“ అని వ్యాఖ్యానించారు.