బాల నటుడిగా 50కి పైగా సినిమాలను చేసిన తేజ సజ్జా హీరోగా జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో తేజ ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుని యంగ్ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో నిలిచాడు. టైర్ 2 హీరోల జాబితాలో చోటు దక్కించుకున్న తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ తో మిరాకిల్ క్రియేట్ చేసేందుకు గాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హనుమాన్ సినిమా తర్వాత వందల కొద్ది స్క్రిప్ట్‌లు వచ్చినా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. పెద్ద బ్యానర్‌లు వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా మిరాయ్ పైనే దృష్టి పెట్టాడు. అలాంటి తేజ సజ్జా చేసిన ఈ మిరాయ్ మూవీ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న మిరాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తేజ పాల్గొంటున్నాడు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రాబోతున్న తేజ సజ్జా మిరాయ్ పై చాలా నమ్మకం గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్‌ను చూస్తే మంచి కంటెంట్ ఉన్న సినిమాగా అనిపిస్తుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అద్భుతమైన విజువల్స్‌తో పాటు, ఆకట్టుకునే కథ, కథనంతో మిరాయ్ ను రూపొందించాం అంటూ మేకర్స్ చెబుతున్నారు. హీరోగా తేజ మాట్లాడుతూ ఇది తనకు మరో విజయాన్ని కట్టబెడుతుంది అనే విశ్వాసంను వ్యక్తం చేశాడు. ఆకట్టుకునే కథ, కథనంతో మిరాయ్ సినిమా ఉంటుందనే విశ్వాసంను తేజను అభిమానించే వారితో పాటు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మిరాయ్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.
తాజాగా మిరాయ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తేజ సజ్జా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాల నటుడిగా తేజ చాలా సినిమాల్లో నటించాడు. చిరంజీవి ఎత్తుకుని ఉన్న ఫోటోలు తేజ వద్ద చాలానే ఉంటాయి. ఇప్పటికీ తేజ అంటే చిరంజీవి ప్రత్యేకమైన అభిమానం కనబర్చుతాడు అంటారు. తేజ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే సమయంలో చాలా సలహాలు సూచనలు సైతం ఇచ్చాడట. చిరంజీవితో సన్నిహిత్యం ఉన్న కారణంగా చరణ్ తోనూ తేజకి మంచి సన్నిహిత్యం ఉందట. వీరిద్దరి మధ్య కనీసం పరిచయం అయినా ఉందా అని చాలా మంది అనుకుంటారు. కానీ తాజాగా తేజ తనకు చరణ్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మేము బయట కనిపించం కానీ, చాలా సందర్భాల్లో కలుస్తామని అన్నాడు.
హనుమాన్ సినిమా విడుదల తర్వాత ఒకసారి షూట్ లో ఉన్నాను. షూటింగ్ బయట ఉంది, అర్థ రాత్రి దాటే వరకు షూటింగ్ చేశాం. షూటింగ్ పూర్తి చేసి పడుకున్న సమయంలో నాకు కాల్ వచ్చింది. అర్థరాత్రి 12.30 సమయంలో వచ్చిన కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మీతో ఒక వ్యక్తి మాట్లాడుతారు అని ఫోన్‌ను పక్కన ఉన్న వ్యక్తికి ఇచ్చారు. నాకు చరణ్ ఫ్రాంక్ కాల్ చేశారు. ఆ సమయంలో చాలా విషయాలను మాట్లాడుకున్నాం. మొదట చరణ్ అనే విషయాన్ని గుర్తించకుండా మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు. చరణ్ ప్రతి విషయంలోనూ చాలా క్లోజ్‌గా ఉంటారు, ఆయన నుంచి చాలా విషయాలను నేర్చుకుంటాను, అంతే కాకుండా ఆయన గొప్ప వ్యక్తి అని, మేము ఇద్దరం ఎన్నో సార్లు కలిశాం, మాట్లాడుకున్నాం అని తేజ అన్నాడు. మిరాయ్ సినిమా విడుదల తర్వాత మళ్లీ తేజకు చరణ్ నుంచి కాల్ వెళ్లినా ఆశ్చర్యం లేదు.