మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే, కొన్నిరోజుల కిందట మీ ఫోన్‌లో మార్పును గమనించి ఉంటారు. చాలామంది ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ కాల్, డయలర్ సెట్టింగ్స్‌లో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు.
ఫోన్‌లలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుల గురించి సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనిపై అసంతృప్తినీ వ్యక్తం చేశారు.
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు లేదా కాల్ అందుకున్నప్పుడు ఫోన్ ఇంటర్‌ఫేస్, అంటే డిస్‌ప్లే, డిజైన్ మారినట్లు కనిపిస్తుంది. ఎలాంటి సెట్టింగ్స్ మార్చకుండా లేదా ట్యాంపరింగ్ చేయకుండా డిస్‌ప్లే దానంతట అదే ఎలా మారిందని చాలామంది అయోమయంలో ఉన్నారు. కొందరు తమ ఫోన్ హ్యాక్ అయిందా? అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు.
చాలామంది ఆండ్రాయిడ్ వినియోగదారులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దీని గురించి పోస్టులు చేశారు.
చాలామంది వినియోగదారులు ఎవరికి తోచినట్లు వారు ఈ సమస్యకు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నించారు. సోషల్ మీడియాలో కొందరు దీనిని ‘హ్యాకింగ్’తో ముడిపెట్టగా, మరికొందరు ఈ ‘అప్‌డేట్’ ప్రభుత్వ సంస్థల నిఘా రూపమా? అనే సందేహాలు వ్యక్తం చేశారు.
ఎక్స్(ట్విటర్) అకౌంట్ నుంచి ఒక యూజర్ తన పోస్టులో “అభినందనలు, మీ ఫోన్ సెట్టింగ్స్ కూడా మారాయి. సాఫ్ట్‌వేర్ కూడా దానికదే ఇన్‌స్టాల్ అయింది, ఇప్పుడది మీకు వ్యతిరేకంగా చిలుకపలుకులు పలుకుతుంది” అని రాశారు.
మరొక యూజర్ “మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ ఉన్నట్టుండి మారిపోయాయి. మీరు నిజంగా సురక్షితంగానే ఉన్నారని భావిస్తున్నారా?” అనే ప్రశ్న లేవనెత్తారు.
అయితే, ఫోన్ డిస్‌ప్లే సెట్టింగ్స్ మార్చడమనేది ‘హ్యాకింగ్’ కాదని, ఆ కంపెనీ మీ ఫోటోలు లేదా సందేశాలను దొంగిలించిందని కూడా కాదని మరొక ఎక్స్ యూజర్ పోస్టు పెట్టారు.
మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఫోన్‌లను అప్‌డేట్ చేస్తుంటాయని, తద్వారా అవి మునుపటి కంటే మెరుగ్గా, సురక్షితంగా మారుతాయని రాశారు.
ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చిన గూగుల్, ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ కూడా చేస్తుంది.
‘మెటీరియల్ 3D ఎక్స్‌ప్రెసివ్’ అనే అప్‌డేట్ తీసుకొస్తున్నట్లు గూగుల్ 2025 మేలోనే ప్రకటించింది.
గత కొన్నేళ్లలో వచ్చిన అతిపెద్ద అప్‌డేట్‌లలో ఇదొకటి. ఈ అప్‌డేట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ డిస్‌ప్లే వినియోగాన్ని సులభతరం చేయడంతో పాటు, మరింత వేగవంతం చేస్తుందని గూగుల్ పేర్కొంది.
‘గతంలో మా ఆండ్రాయిడ్ ఫోన్‌ల డిస్‌ప్లే ‘మెటీరియల్ 3D’ అనే డిజైన్‌పై పనిచేసేది. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కోట్లాది మంది యూజర్లు దీనికి అలవాటు పడ్డారు’ అని గూగుల్ తెలిపింది.
కొత్త డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో చాలా మారతాయని గూగుల్ పేర్కొంది. నోటిఫికేషన్లు, కలర్ థీమ్‌లు, ఫోటోలు, జీమెయిల్, వాచ్ మొదలైన అప్‌డేట్స్ కూడా అందులో ఒక భాగం.
‘మెటీరియల్ 3D ఎక్స్‌ప్రెసివ్’ అప్‌డేట్ కింద ఆండ్రాయిడ్ ఫోన్స్ కాల్ యాప్ డిజైన్‌ను మార్చినట్లు గూగుల్ తెలిపింది.
ఈ అప్‌డేట్ మొదట జూన్‌లో కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తరువాత దశలవారీగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ ప్రకారం, కాలింగ్ యాప్ వాడకాన్ని సులభతరం చేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం.
‘రీసెంట్’ (రీసెంట్ కాల్స్), ‘ఫేవరెట్స్’ ఆప్షన్లను ‘హోమ్’లో కలిపేసింది గూగుల్. దీంతో, ఇప్పుడు మీరు ఫోన్ యాప్‌ను ఓపెన్ చేస్తే, ‘హోమ్’, ‘కీప్యాడ్’ ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి.
గూగుల్ ప్రకటన ప్రకారం, ఇప్పుడు ఒకే నంబర్ నుంచి వచ్చే అన్ని కాల్స్ ఒకే చోట కనిపించవు. బదులుగా, సమయం వారీగా కాల్ హిస్టరీలో కనిపిస్తాయి.
దీంతో, యూజర్లు తమ కాల్ హిస్టరీని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి లేదా ఎన్ని వచ్చాయో చూడటానికి ప్రతి నంబర్‌ను విడిగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని తెలిపింది.
అంతేకాదు, ‘ఇన్‌కమింగ్ కాల్’, ‘ఇన్-కాల్’ డిజైన్‌ను కూడా యూజర్ ఫీడ్‌బ్యాక్ తర్వాత మార్చారు. తద్వారా యూజర్లు ఫోన్ తీసేటప్పుడు అనుకోకుండా కాల్స్‌ను స్వీకరించరు లేదా కట్ చేయరు.
గూగుల్ ప్రకటన, సోషల్ మీడియాలో పలువురి పోస్టుల ద్వారా వారి ఫోన్ అప్‌డేట్ దానికదే అయిందని చాలామంది అర్థం చేసుకున్నారు. కానీ, ఇప్పటికీ కొందరికి ఫోన్ సెట్టింగ్స్ మారలేదు.
గూగుల్ బ్లాగులోని ఒక యూజర్ మాట్లాడుతూ, కొంతమంది యూజర్లు తమ ఫోన్లలోని గూగుల్ ప్లే స్టోర్‌లో ఆటో-అప్‌డేట్‌లను ఆన్ చేసి ఉంటారని, కాబట్టి కొన్ని యాప్‌లు వాటికవే అప్‌డేట్ అయ్యాయని తెలిపారు.
యూజర్లు ఈ ఆటో-అప్‌డేట్‌లను ఆఫ్ చేసి, ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి ‘అన్‌ఇన్‌స్టాల్ అప్‌డేట్స్’ ఎంపికపై క్లిక్ చేస్తే ఫోన్ కాల్ డిస్‌ప్లే సెట్టింగ్‌లను వాటి మునుపటి స్థితికి పునరుద్ధరించవచ్చని తెలిపారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ కూడా ఇదే వివరణను ఇచ్చింది.
ఎక్స్ (గతంలో ట్విట్టర్)లోని ఒక యూజర్ ఇలా ఎందుకు చేశారని కంపెనీని ప్రశ్నించినపుడు, “ఇది వన్‌ప్లస్ నుంచి జరగలేదు, గూగుల్ ఫోన్ యాప్ అప్‌డేట్ నుంచి వచ్చింది. మీరు ఇప్పటికీ మీ ఫోన్‌లోని పాత శైలిని ఇష్టపడితే, అప్‌డేట్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి” అని వన్‌ప్లస్ బదులిచ్చింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చెప్పింది.
కాబట్టి, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా మార్పులను మీరు గమనించినట్లయితే ఆందోళన చెందక్కర్లేదు. మీరు ఇప్పటికీ పాత డిస్‌ప్లేని ఇష్టపడితే, ఈ కొత్త డిస్‌ప్లే వద్దనుకుంటే, అప్‌డేట్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా పాత డిస్‌ప్లేకి మారొచ్చు.