సాధారణంగా ఏపీ సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా.. నినాదాలు ప్రకటిస్తారు. 2024లో ఏపీలో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. బోలెడు నినాదాలు ఇచ్చారు. వీటిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, విజన్ -2047, పీ-4 గేమ్ ఛేంజర్ వంటివి కీలకం. వీటిద్వారా రాష్ట్ర స్థితిగతులను మారుస్తానని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి నినాదాలకు తర చుగా దూరంగా ఉండే వైసీపీ కూడా ఇప్పుడు నినాదాల బాటను ఎంచుకుంది. అయితే.. ఇది సీఎం చంద్రబాబుకు పోటీగానా? లేక.. పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకునేందుకా? అనేది తేలాల్సి ఉంది.
వైసీపీ తాజాగా `మేక్ ఏపీ-గ్రేట్ ఎగైన్` నినాదం అందుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి నాయకుల వరకు, కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి నేతల దాకా అందరూ.. ఇప్పుడు `మేక్ ఏపీ-గ్రేట్ ఎగైన్` అనే నినాదం అందుకున్నారు. గత ఏడాది అమెరికా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే ఆయనకు బెడిసి కొడుతోంది. అమెరికాను ఉత్తమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో నిలపాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలు, నిరసనలకు కూడా దారితీస్తున్నాయి.
అచ్చు.. అమెరికా అధ్యక్షుడి తరహాలోనే `మేక్ ఏపీ-గ్రేట్ ఎగైన్` అనే నినాదాన్ని వైసీపీ అందుకోవడం గమనార్హం. దీనర్ధం.. గత వైసీపీ హయాంలో ఏపీ ఉన్నతస్థాయిలో ఉందని.. దీనిని తిరిగి సాధించాలనే!. ప్రస్తుతం పార్టీ లోగోల కింద కూడా.. దీనిని ముద్రించారు. ఇక, నాయకులు, మాజీ మంత్రుల ఎక్స్ ఖాతాలకు కూడా ఈ నినాదాన్ని జోడించారు. దీనిని బట్టి గత వైసీపీ పాలననుముఖ్యమంగా జగన్ పరిపానలో ఏపీ పుంజుకుందని చెప్పడమే పార్టీ సహా నాయకుల ఉద్దేశం. అయితే.. దీనిని ఏపీ ప్రజలు ఏమేరకు అర్ధం చేసుకుంటారన్నది చూడాలి. ఇదిలావుంటే.. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు మాత్రం గత వైసీపీ పాలన చెత్తగా ఉందని చెబుతున్న విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లోనూ వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. అంటే.. వైసీపీ పాలన బోగోలేదనే కదా! అని ఇటీవల కూడా టీడీపీ నాయకులు విమర్శించారు. మరి మళ్లీ అదే పాలనను వైసీపీ అందిస్తుందన్న అర్ధంలో నూతన నినాదాన్ని తెరమీదికి తీసుకురావడం గమనార్హం. తాజాగా వైసీపీ చేపట్టి మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై నిరసనకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే నూతన నినాదాన్నిపార్టీ అందిపుచ్చుకోవడం గమనార్హం. అయితే.. ఇది ఎంతవరకు ప్రజలకు ఎక్కుతుందో చూడాలి. గత ఎన్నికలకు ముందు “వైనాట్ 175, సిద్ధం“ అంటూ.. పార్టీ ఇచ్చిన నినాదాలు విఫలమైన విషయం తెలిసిందే.