కూటమి ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్నవారికి ఇంకా నిరాశే ఎదురవుతోంది. పార్టీ పరంగా పదవుల విషయంలోనేకాదు.. ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఇబ్బందులు వస్తున్నాయి. వాస్తవానికి ఈ దఫా సుమారు 200 పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు భావించారు. వీటిలో మిగిలిపోయిన మార్కెట్ యార్డు కమిటీలతోపాటు.. పలు దేవాలయాలకు మిగిలిన చైర్మన్ పోస్టులు, బోర్డుల నియామకాలను కూడా చేపట్టాలని భావించారు. ఈ క్రమంలో గత వారంలోనే ఈ వ్యవహారం తేల్చాలని అనుకున్నారు.
దీంతో పార్టీ నాయకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, తీరా చూస్తే.. ఇతర విషయాలతో టీడీపీ నాయకుల సమావేశం హాట్ హాట్‌గా సాగింది. పలువురు ఎమ్మెల్యేలపై గత వారం పదిరోజుల్లో వచ్చిన విమర్శలు, వార్తలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అదేవిధంగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అంటూ.. సుమారు గంటకు పైగానే నాయకులకు క్లాస్ ఇచ్చారు. వైసీపీ అనేక విషయాల్లో ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని, అయినా.. నాయకులు పట్టీపట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు ఒకరకంగా ఫర్వాలేదని.. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం ఎవరూ నోరు విప్పడం లేదన్నది సీఎం చంద్రబాబు ఆవేదన. ఇక, అదేసమయంలో విశాఖలో ఏర్పాటవుతున్న గూగుల్ సంస్థ పెట్టుబడులు.. వాటిపై ప్రమోషన్ తదితర అంశాలపై మరో అరగంట సేపు చంద్రబాబు చర్చించారు. విశాఖ నాయకులు ఎవరూ దీనికి అనుకూలంగా మీడియా ముందుకు రాకపోవడం.. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలు, వాటికి ఎవరూ కౌంటర్ ఇవ్వకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలా.. మొత్తం వ్యవహారం ఆయా అంతర్గత అంశాలపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. దీంతో పద వుల అంశంపై మరోసారి చర్చించనున్నట్టు చివరి మాటగా చెప్పుకొచ్చారు. కానీ.. వ్యవస్థాగతంగా చేయా ల్సిన పనులు చేయకపోవడంతోనే చంద్రబాబు ఇలా పదవుల నుంచి తప్పించుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. అంటే.. నాయకులు బలమైన వాయిస్ వినిపించకపోవడం.. సర్కారుకు అనుకూలం గా వ్యవహరించకపోవడంతోనే.. ఆయన అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మరి ఆయన మనసును గెలుచుకునేందుకు నాయకులు ఏమేరకు పనిచేస్తారో చూడాలి.















