సింగనమల ఎమ్మెల్యే బండారి శ్రావణికి ఊహించని విధంగా భారీ షాక్ తగిలినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సింగనమల నియోజకవర్గంలోని మండల కన్వీనర్ల ఎంపికలో టూ-మెన్ కమిటీకి ప్రత్యేక ప్రిఫరెన్స్ ఇచ్చిన పార్టీ నేతలు, తమకు నచ్చిన నాయకులను ముందుకు తీసుకువచ్చి కన్వీనర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.
తెలుగుదేశం పార్టీ సింగనమల నియోజకవర్గంలో నార్పల మండల కన్వీనర్‌గా కుళ్లాయప్ప, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ, సింగనమల మండల కన్వీనర్‌గా మారుతి నాయుడు, పుట్లూరు మండల కన్వీనర్‌గా శ్రీనివాసులు పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గతంగా తీసుకున్న ఈ నిర్ణయంపై కార్యకర్తల మధ్య మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఈసారి ముఖ్యంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుగుదేశం కార్యకర్తలే తమ మొబైల్ ఫోన్లలో ఓటింగ్ చేసి మండల కన్వీనర్లను ఎన్నుకున్నారు. కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా నాయకులు ఎంపిక కావడం పార్టీలో ఓ నూతన ప్రయోగంగా భావిస్తున్నారు. అయితే, ఈ ఎంపికల వల్ల కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరిందని కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తంమీద సింగనమల రాజకీయాల్లో ఈ కొత్త మార్పులు రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలకు దారితీయనున్నాయి.


















