ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గం గన్నవరంలో టీడీపీ నేతల మధ్య కొట్లాటలు.. వాగ్వాదాలు ముదురుతూనే ఉన్నాయి. వీటిపై అధిష్టానం ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా.. ఆ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. తాజాగా మరోసారి ఈ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఇచ్చారు. అయితే.. దీనిని కొందరు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే… ఆరని మంటల్లా ఎప్పుడూ రాజకీయంగా రగులుతూనే ఉన్నాయి.
గన్నవరం టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడి విభేదాలు గత ఎన్నికలకు ముందు నుంచి ఉన్నాయి. అయితే .. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. ఎప్పటికప్పుడు సంయమనం పాటిస్తూ.. వాటిని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ.. మరో పక్షం మాత్రం.. రచ్చకెక్కి రెచ్చగొడుతున్న తీరు పార్టీలో విస్మయానికి దారి తీస్తోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, సీనియర్ నేత పొట్లూరి బసవరావు మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుపై పొట్లూరి తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరంలో టీడీపీ సీనియర్లను యార్లగడ్డ పక్కన పెట్టారన్న పొట్లూరి.. నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. ”నాకు ఎయిర్‌పోర్ట్ కమిటీ మెంబర్ ఇవ్వటంతో యార్లగడ్డ ద్వేషం పెంచుకున్నారు. టీడీపీ నేతలంటే యార్లగడ్డకు నచ్చదు. సీనియర్లతో సంబంధాలు యార్లగడ్డ వదిలేశారు” అని పొట్లూరి ఆరోపించారు. అయితే.. వాస్తవానికి యార్లగడ్డ టీడీపీని నెత్తిన పెట్టుకున్నారు.
కానీ, స్థానిక నాయకత్వమే ఆయనను పక్కన పెడుతోందన్న చర్చ కూడా ఉంది. నియోజకవర్గం అభివృద్ది సహా.. ఎప్పటికప్పుడు వైసీపీపై విరుచుకుపడడంలోనూ యార్లగడ్డ ముందున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు మనన్ననలు కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. స్థానికంగా తనను విభేదించే వారిని ఆయన పక్కన పెట్టిన మాట వాస్తవమే. ఇదే ఇప్పుడు వివాదానికి మరోసారి దారితీసింది. అందరూ కలిసి ఉండాలని పార్టీ అధిష్టానం చెబుతున్నా.. తనపై వ్యతిరేకత పెంచేలా నాయకులు వ్యవహరిస్తున్నారన్న ది యార్లగడ్డ ఆవేదన. ఏదేమైనా సీఎం చంద్రబాబు ఈవిషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నవాదన వినిపిస్తోంది.