తెలుగు రాజకీయాల్లో పాతతరం – కొత్తతరం మధ్య సంధానకర్తగా నిలిచే నాయకుడు ఎవ్వరైనా ఉంటే అది చంద్రబాబే అని చెప్పాలి. నాలుగైదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కసిగా పోరాడుతున్న ఆయన ఒకవైపు సంప్రదాయ రాజకీయ నేతల్లో కనిపించే కాఠిన్యం, మరోవైపు కొత్తతరం నాయకుల్లో కనిపించే ఆధునిక ఆలోచన – రెండింటినీ తనలో కలిపి ఉంచుకున్నారు. పాలనలో టెక్నాలజీని తెచ్చిన విజనరీ అన్న గుర్తింపు ఒక వైపు ఉంటే, పార్టీ క్రమశిక్షణలో కఠినతర అధినేత అన్న పేరు మరో వైపు ఆయన వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు గాడి తప్పే తీరు ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు స్వయంగా ఒప్పుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది.
సీనియర్ నేతలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కానీ కొత్తవాళ్లు మాత్రం అతి చేసి పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన నేరుగా ఎత్తిచూపారు. ఇప్పటివరకూ 35 మంది ఎమ్మెల్యేలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడినట్లు ఆయన చెప్పడం కూడా గమనార్హం. చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ లోపలే కాకుండా మొత్తం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. “ఎవరైనా గాడి తప్పితే ఒకసారి పిలిచి చెప్పుతా. మారకపోతే రెండోసారి చెబుతా. కానీ మూడోసారి చెప్పటం ఉండదు. అప్పుడే కఠిన చర్యలు తప్పవు” అంటూ ఆయన స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన ఇంతవరకూ మాటల్లోనే కఠినత చూపించారే కానీ చేతల్లో చూపించలేదని కొందరు విమర్శిస్తున్నారు. “చంద్రబాబు గారి మాటలు దండం.. కానీ చేతల్లో కనిపించేవి లేవు” అని ఒక సీనియర్ నేత విసురుగా చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న కొందరు ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షించాలి అనే ప్రశ్న తెలుగు తమ్ముళ్లలోనూ వినిపిస్తోంది. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించకపోతే మిగిలినవారికి భయం భక్తులు రావని చాలామంది చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఆచరణలో మార్పు తీసుకురావాలని కోరుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇచ్చే హెచ్చరికలు పక్కా “తాటాకు చప్పుళ్ల”లా మారిపోతున్నాయనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆయన నిజంగానే ఈసారి మాటలు కాకుండా చేతల్లో చూపిస్తేనే పార్టీ క్రమశిక్షణ కాపాడబడుతుందనేది స్పష్టమైంది. లేని పక్షంలో “కఠినత మాటల్లోనే ఉంటుంది.. చేతల్లో లేదు” అన్న నెగిటివ్ ట్యాగ్ ఆయనకు అంటిపడే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు మాటలు వాస్తవమవుతాయా? లేక మళ్లీ పాత తరహా హెచ్చరికలకే పరిమితమవుతారా? అన్నది చూడాల్సిందే.