నాయకులకు ఏదైనా ఒక పని అప్పచెప్తే దానిని నిబద్ధతతో పూర్తి చేస్తారని పార్టీ అధినేతలు విశ్వాసం పెట్టుకుంటారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని అధినేతలు గుర్తించే అవకాశం ఉండదు. పట్టించుకునే సమయం కూడా పెద్దగా కనిపించదు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తలపై పెద్ద ఎత్తున నమ్మకంతో ఉంటారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. కార్యకర్తలను నడిపించే బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. అయితే టిడిపి విషయంలో ఇది కొంత బెడిసిపడుతోంది.
పదేపదే చంద్రబాబు చెబుతున్నప్పటికీ నాయకులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. మరి దీనికి కారణాలు ఏంటి అనేది తెలియకపోయినా.. ఇతర వ్యాపకాలపై ఉన్న శ్రద్ధ పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా చేపడుతున్న కార్యక్రమాలపై మాత్రం ఉండటం లేదు. ఉదాహరణకు చంద్రబాబు రెండు అంశాలను పార్టీ నాయకులకు అప్పగించారు. ఒకటి గత ఏడాది కాలంగా చేపట్టిన సంక్షేమం అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఇది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సహా ద్వితీయశ్రేణి నాయకులుగా ఉన్న వారికి కూడా వర్తిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కానీ, ఈ విషయాన్ని నాయకులు అదే విధంగా మాజీలు కేవలం ఏదో మంత్రికి మాత్రమే సంబంధించిన వ్యవహారంగా భావించారో లేక ఇది చేస్తే మాకేంటి అనుకున్నారో తెలియదు కానీ వారు మౌనంగా ఉండిపోయారు. ఇక మరో కేలక విషయం పి -ఫోర్ పేదలను గుర్తించి వారిని దత్తత తీసుకునేలాగా పారిశ్రామిక వేత్త లు కార్పొరేట్ సంస్థల దిగ్గజాలను ఒప్పించే బాధ్యత. దీనిని కూడా తొలినాళ్లలో ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు అప్పగించారు. మీ మీ పరిధిలో ఎంతమంది పేదలు ఉంటే వారందరినీ దత్తత తీసుకునేలాగా కార్పొరేట్ సంస్థలను వ్యాపార వర్గాలను పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించాలని ఆయన నాయకులకు సూచించారు.
కానీ, ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన వారంతా పట్టి పట్టనట్టే వ్యవహరించారు. మరోవైపు అటు సుపరిపాలనలో తొలి అడుగు కానీ ఇటు పి4 కార్యక్రమానికి కానీ చాలా సమయం ఉంది. ఈ రెండు కార్యక్రమాలకు డెడ్లైన్ అనేది ఇంకా చంద్రబాబు పెట్టలేదు. కానీ అంతా అయిపోయినట్టుగా, ప్రజలు చాలా సంతోషంతో ఉన్నట్టుగా నాయకులు భావిస్తున్నారు. లేక వారికి సమయం చిక్కడం లేదని నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. మొత్తానికి ఈ రెండు కార్యక్రమాలను పూర్తిగా అటక ఎక్కించేశారు. నాయకులు ఎక్కడ స్పందించడం లేదు.
ప్రజల మధ్య కూడా తిరగడం లేదు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం నిర్వహించినా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కూటమి పార్టీలపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇది ఏ మేరకు సమంజసం. ఏ మేరకు పార్టీకి మేలు చేస్తుంది. ఎన్నికలు అనేవి అయిపోయాయా లేదా నాలుగేళ్ల వరకు రావా నాలుగేళ్ల తర్వాత చూసుకుందాంలే అనే ఉద్దేశంతో ఉన్నారా? అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎలా చూసుకున్నా చంద్రబాబు చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అసలు సంబంధం లేకుండా పోవడం పార్టీలో ఇబ్బందికరంగా మారింది అన్నది వాస్తవం.