నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. తాజాగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ వ్యవహారం సర్కారుపై మరక పడేలా చేసింది. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో నకిలీ మద్యాన్ని తయారుచేసి ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారన్న వాదన అధికారుల నుంచి గత నాలుగు నెలలుగా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విషయంలో ఉదాసీనంగా ఉంటూ సమస్యను ప్రస్తావించకుండా వ్యవహరిస్తోందన్న వాదన ఉంది.
ఇప్పుడు, తాజాగా తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన టిడిపి సానుభూతిపరులు, టిడిపి అనుకూల నాయకులు.. ఓ సీనియర్ నాయకుడు కూడా నకిలీ మద్యం తయారీలో కీలకపాత్ర పోషించారు అన్నది ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్న మాట. దీనికి సంబంధించి తాజాగా వారు ఆధారాలతో సహా బయటపెట్టారు. నిజానికి ప్రభుత్వమే మద్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలకు విరివిగా కూడా అందిస్తోందనే చెప్పాలి. అలాంటప్పుడు నకిలీ మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది… ఎందుకు.. అనేది కీలక అంశం.
ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు నకిలీ మద్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లు వారి అనుచరులు కూడా ఉండడం మరింత వివాదానికి దారితీస్తోంది. కాకినాడ, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు ఇలా పలు జిల్లాల్లో నకిలీ మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది అన్నది ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు ఈ సమస్యను పట్టించుకుని, పరిష్కరించి ఉంటే బాగుండేది. కానీ, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం.. వారే మారతారు అని పైపైన హెచ్చరికలు చేసి వదిలేయడంతో చివరికి తంబళ్లపల్లె వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కురిపేసే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు స్థానిక నాయకుల ప్రమేయం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, కేవలం చిన్నస్థాయి ఉద్యోగులు లేదా చిన్న స్థాయి నేతలపై చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల నుంచి ఇలాంటి విధానాల నుంచి నాయకులను కట్టడి చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ముఖ్యంగా టిడిపి నాయకులు ఒకవైపు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యంగా మారింది. మరోవైపు వైన్ షాపులు, అదేవిధంగా బార్ల నుంచి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి మళ్లీ 2019 మాదిరిగా ఎమ్మెల్యేలు మారకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నాయకులు చెబుతున్నారు.