జేసీ బ్రదర్స్ అంటే మజాకానా అన్నది మరోసారి రుజువు అయింది. తాడిపత్రిలో జేసీలదే రాజకీయ ఆధిపత్యం. వారే దశాబ్దాలుగా శాసీస్త్తూ వస్తున్నారు. అటువంటి జేసీలను 2019లో కేతిరెడ్డి పెద్దా రెడ్డి ఓడించారు. దాంతో అయిదేళ్ళు తిరగకుండనే తమ వద్దకు రాజ్యాధికారాన్ని తెచ్చుకున్న జేసీలు పెద్దారెడ్డికి అచ్చంగా చుక్కలనే చూపిస్తున్నారు. గత పదిహేను నెలలుగా తమ సొంత ఊరు తాడిపత్రికి వెళ్ళాలన్న పెద్దారెడ్డికి అది వీలు పడడం లేదు. హైకోర్టు ఆదేశాలతో వచ్చినా తాజాగా ఆయనకు చుక్కెదురే అయింది.
ఇటీవల హైకోర్టు నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నారు. తన సొంత ప్రాంతం తాడిపత్రి వెళ్ళాలని అనుకున్నారు అలా జేసీ ప్రభాకరరెడ్డి మీద తన ఆధిపత్యం చూపించాలని భావించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికే దగ్గులు నేర్పే వారు. అందుకే ఆయన ఏకంగా భారీ స్కెచ్ గీసారు. ఈ దెబ్బతో పెద్దారెడ్డి అడుగు కూడా వేయలేక వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అని అంటున్నారు.
ఇక పెద్దారెడ్డిని పోలీసులే స్వయంగా బందోబస్తుతో తీసుకుని వెళ్ళి ఆయన ఇంటి వద్ద దించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో అవసరం అయితే ఫోర్స్ ని కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా పేర్కొంది. అలా సోమవారం ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్యలో గట్టి బందోబస్తు మధ్యలో తాడిపత్రిలో పెద్దారెడ్డిని దించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఆ పని చేయలేకపోయారు. అలా తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని మధ్యలోనే పోలీసులు ఆపేసి వెనక్కి పంపించేశారు. ఆయన తనకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తీసి పోలీసులకు చూపించినప్పటికీ ఏ మాత్రం ఆయనకు ముందుకు పోనీయలేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఎత్తు వేశారు అంటున్నారు. ఆయన అదే సమయంలో శివుని విగ్రహం ప్రారంభోత్సవం పేరుతో అతి పెద్ద కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి తన పార్టీకి చెందిన అభిమానులు అనుచరులు తరలి రావాలని కోరారు. దాంతో వారంతా వచ్చారు. దీంతో ఏ వైపు నుంచి ఉద్రిక్తతలు వస్తాయేమో అని భావించిన పోలీసులు జేసీ ఇంటి వద్ద బందోబస్తు చేస్తూనే పెద్దారెడ్డిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు మరో వైపు చూస్తే పెద్దారెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తాడిపత్రి పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అక్కడ వచ్చే తీర్పు బట్టే పెద్దారెడ్డి మరో మారు తాడిపత్రి వెళ్లే సాహసం చేసే వీలుంది అని అంటున్నారు.