జీరో సైజ్ మీద ప్రేమ, మమకారం ఉండాలి కానీ, మరీ ఈ రేంజులో ఉంటే ప్రమాదం. ఒకప్పుడు బెబో కరీనా కపూర్ `తషాన్` కోసం ఇలాంటి ప్రయోగాలు చేసినా కానీ, అప్పటి కాలం వేరు.. పరిస్థితులు వేరు. ఇప్పటి సన్నివేశం పూర్తిగా వేరు. ఇప్పుడు బొద్దుగుమ్మలు కూడా ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. రూపం కంటే ప్రతిభ, చాణక్యం చాలా ముఖ్యం.
కానీ కాలం కాని కాలంలో తాప్సీ పన్ను ప్రయోగాలేమిటో అర్థం కాని పరిస్థితి. సైజ్ జీరోపై ఎంత పిచ్చి వ్యామోహం పెంచుకున్నా, అందం ఆకృతిపై మమకారంతో మరిగిపోతున్నా.. మరీ ఇంత మైనస్ సైజ్ కి వెళ్లిపోవడం సమంజసం కాదేమో! అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాప్సీ పన్ను తిండి తింటోందా లేదా? అందం కోసం బక్కచిక్కిన దేహం కోసం, సన్నజాజి నడుము కోసం పాకులాటలో కనీస తిండిని మర్చిపోతే ఎలా? ఆ కళ్లు గుంటలు పడిపోయేంతగా తాప్సీ పన్ను ఈ సాహసాలేంటీ? అంటూ నిలదీస్తున్నారు అభిమానులు.
ఏది ఏమైనా.. ఎవరు ఏం చెప్పినా తాప్సీకి జీరో సైజ్ పై ఉన్న మమకారం అంత తేలిగ్గా వదిలిపోదు. దానికోసం ఎంతకైనా వెళుతుంది. ఇప్పుడు బ్లాక్ ఫ్రాక్‌లో తాప్సీ సన్నజాజి రూపం మైమరిపిస్తున్నా కానీ, మరోవైపు మరీ ఇలా చిక్కిపోతే అనారోగ్య సంకేతం! అంటూ కంగారు పడే అభిమానులు ఉన్నారు. తాప్సీ పన్ను ఎన్ని చేసినా బ్యాలెన్స్ చేయకపోతే కష్టం. అందువల్ల ఈ రింగుల జుత్తు సుందరి విషయాన్ని వేగంగా అర్థం చేసుకుంటే మంచిదని అభిమానులు సూచిస్తున్నారు.
ఇటీవలే విదేశీ బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బో ని పెళ్లాడిన తర్వాత తాప్సీ బొత్తిగా రంగుల ప్రపంచానికి దూరమవుతోందనే ఆవేదన అభిమానుల్లో అలానే ఉంది. తాప్సీ నటించిన సినిమా విడుదలై చాలా కాలమే అయింది. అందువల్ల ఆందోళన మరింత పెరుగుతోంది. అయితే తాప్సీ ఇప్పుడు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. మూడు ప్రయోగాత్మక స్క్రిప్టులను ఎంపిక చేసుకుని వాటిలో నటిస్తోంది. వో ల్కీ హై కహన్? , గాంధారి, ముల్క్ 2 ఇవన్నీ వేటికవే భిన్నమైన కథలతో రూపొందుతున్న చిత్రాలు. ఇవన్నీ నిర్మాతలకు డబ్బు తెచ్చినా తేకపోయినా తాప్సీకి మాత్రం పేరు తెచ్చేవే!!